అది కాబుల్ 1990... రహ్మానీని ప్రసవించేందుకు ఆమె తల్లి ప్రసవ వేదన పడుతోంది. అదే సమయంలో వారి పక్కింటిపై బాంబు దాడి జరిగింది. దీంతో ఆమె ఆసుపత్రికి వెళ్లేందుకు వీలుపడకపోవడంతో నీలోఫర్ రహ్మానీ ఇంట్లోనే పుట్టింది. ఆ తరువాత కొన్నిరోజులకు రహ్మానీ కుటుంబం పాకిస్తాన్‌కు వలస వెళ్లింది. అక్కడ పెరిగిన రహ్మానీకి.. తన తండ్రి తమ మాతృదేశం అఫ్గాన్ అని, 70 దశకంలో దేశంలో చోటుచేసుకున్న అనేక విషయాల గురించి చెబుతుండేవారు.
‘‘అప్పట్లో మహిళలకు చాలా స్వేచ్ఛ ఉండేది. వీధుల్లో ఎటువంటి భయం లేకుండా తిరిగేవారు. అఫ్గాన్ ఆకాశంలో రష్యన్ జెట్‌లు ఎగురుతుండేవి. వాటిని చూస్తూ పెరిగిన నేను ఎలాగైనా పైలట్ కావాలనుకునేవాడిని. కానీ అప్పట్లో పైలట్ అవ్వడానికి డబ్బులు లేకపోవడంతో సివిల్ ఇంజినీర్ అయ్యాను. నేను పైలట్ కాకపోయినప్పటికి నా పిల్లల్ని పైలట్‌గా తీర్చిదిద్దాలనుకున్నాను’’ అని చెప్పారు నాన్న. ఆ విషయం రహ్మానీ మనసులో బలంగా నాటుకుపోయింది.
నా మాతృదేశం కాదు...
రహ్మానీ కుటుంబం పాకిస్తాన్ నుంచి తిరిగి కాబుల్‌కు 2000 సంవత్సరంలో వచ్చింది. ఆ సమయంలో తన తండ్రి చెప్పిన అప్పటి విషయాలు ఏవీ అఫ్గాన్‌లో కనిపించలేదు. మహిళలు ఎవరూ రోడ్డు మీద తిరగడంలేదు. ఒకరోజు తన చెల్లికి ఆరోగ్యం బాగోక పోవడంతో రహ్మానీ తల్లి, చెల్లెల్ని తీసుకుని హడావుడిగా ఆసుపత్రికి వెళ్లింది. ఈ కంగారులో ఆమె తన కాళ్లకు సాక్సులు వేసుకోవడం మర్చిపోయింది. దీంతో తాలిబన్ పోలీసు అధికారి ఆమెను తీవ్రంగా గాయపరిచాడు. ఆమె రక్తం కారుతున్న కాళ్లతో ఇంటికి వచ్చింది. అది చూసి చలించిపోయిన రహ్మానీ ఇది నా మాతృదేశం కాదనుకుంది.
తొలి మహిళా పైలట్‌గా..
రహ్మానీకి తొమిదేళ్లప్పుడు అమెరికా దళాలు అఫ్గాన్‌లో మోహరించాయి. దీంతో తరచూ జెట్ ఫ్లైట్‌లు తిరిగే శబ్దాలు వినపడేవి. వాటిని విని విమానం నడపాలన్న కోరిక కలిగింది. పద్దెనిమిదేళ్ల వయసులో రహ్మానీ కాబుల్‌లోని ఆఫీసర్ ట్రైనింగ్ స్కూల్లో పైలట్ కోర్సుకు దరఖాస్తు చేసుకుంది. దరఖాస్తు చేసినప్పటికీ అఫ్గాన్ ఎయిర్‌ఫోర్స్ డాక్టర్లు పలుమార్లు ఫిజికల్లీ అన్‌ఫిట్‌గా పరిగణించి తిరస్కరించారు. అనేక ప్రయత్నాల తరువాత ఆఫీసర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్‌కు ఒప్పుకోవడంతో.. పైలట్ ట్రైనింగ్‌లో చేరింది. పట్టుదలతో కష్టపడి శిక్షణ తీసుకుని 2013లో పైలట్ అయ్యింది. అఫ్గాన్ తొలి మహిళా పైలట్‌గా వార్తల్లో నిలిచి ఒక్కసారి ప్రపంచాన్ని తనవైపు తిప్పుకుంది.
దేశం విడిచిపెట్టాల్సి వచ్చింది..
పైలట్ అయిన ఆనందం ఎక్కువకాలం నిల్వలేదు. రహ్మానీ గురించి బయటప్రపంచానికి తెలిసినప్పటినుంచే కుటుంబాన్ని చంపేస్తామని బెదిరింపులు రావడం మొదలయ్యాయి. బెదిరింపులకు భయపడి నెలకు మూడు ఇళ్లు మారుతూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని జీవించేవారు. అయినప్పటికీ వాళ్లకు ఫోన్‌కాల్ బెదిరింపులు, ‘మీరు ఎక్కడ నివసిస్తున్నారో మాకు తెలుసు’ అని తాలిబన్ స్టాంపు ఉన్న ఉత్తరాలు వచ్చేవి. అయినా ధైర్యంగా పైలట్ బాధ్యతలు నిర్వహిస్తోన్న రహ్మానీని 2015లో మిచెల్ ఒబామా ‘ఇంటర్నేషనల్ విమెన్ ఆఫ్ కరేజ్’ అవార్డుతో సత్కరించింది. ఇదే ఏడాది అమెరికాలో ఏడాది పాటు మిలటరీ పైలట్ శిక్షణ తీసుకుని సి–130 సర్టిఫికెట్‌ను పొందింది.
దీని ద్వారా వివిధ రకాల మిలటరీ ట్రాన్స్‌పోర్టు ఎయిర్‌క్రాఫ్ట్‌లు నడిపే వీలుకలిగింది. అయితే ఈ సర్టిఫికెట్ తీసుకున్నరోజే రహ్మానీ తండ్రి ఫోన్ చేసి ఇక ఇక్కడ మేము జీవించలేమని చెప్పారు. రహ్మానీకి ఉద్యోగం వదులుకోవడం ఇష్టంలేక అమెరికాలో ఆశ్రయం కల్పించమని యూఎస్‌ను ఆశ్రయించింది. జన్మ ధ్రువీకరణ పత్రం లేకపోవడం వల్ల అమెరికా చాలారోజులపాటు అనుమతి ఇవ్వలేదు. చివరికి ప్రముఖ వ్యక్తిగా గుర్తించి దాదాపు ఏడాది తరువాత ఆశ్రయం ఇవ్వడంతో 2018 నుంచి అమెరికాలోని టంపాలో రహ్మానీ నివసిస్తోంది. ఇప్పటికీ తన కుటుంబ సభ్యులను ఎవరైనా అమెరికాకు తీసుకు రాకపోతారా అని ఎదురుచూస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment