బాగ్దాద్ : ఇరాక్ రాజధాని బాగ్దాద్ నగర శివారు ప్రాంతం శనివారం రాత్రి కారు బాంబు పేలుళ్లతో దద్దరిల్లింది. ఈ పేలుళ్లలో 19 మంది మృతి చెందగా... దాదాపు 25 మంది గాయపడ్డారు. క్షతగాత్రులు నగరంలోని వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారని ఉన్నతాధికారులు వెల్లడించారు. బాగ్దాద్ పశ్చిమ ప్రాంతంలో వాణిజ్య కేంద్రం వద్ద కారు బాంబు పేలింది. ఈ ఘటనలో తొమ్మిది మంది అక్కడికక్కడే మరణించారు. మరో 24 మంది తీవ్రంగా గాయపడ్డారు.
అలాగే దక్షిణ బాగ్దాద్లోని బస్ స్టాప్ వద్ద కారు బాంబు పేలుడులో ముగ్గురు మరణించగా... 15 మంది గాయపడ్డారు. ఇక్కడికి సమీపంలోని మార్కెట్ బయట బాంబుపేలి... ముగ్గురు దుర్మరణం పాలైయ్యారు. షీట్ పట్టణంలోని రెస్టారెంట్స్ వద్ద కారు బాంబు పేలుడు సంభవించగా... నలుగురు మృతి చెందగా...14 మంది గాయపడ్డారు. అయితే ఈ దాడులకు తామే బాధ్యులమంటూ ఇప్పటి వరకు ఏ సంస్థ ప్రకటించలేదని ఉన్నతాధికారులు వెల్లడించారు.