
అవినీతిరహిత పాలన ఓ బూతు: బొత్స విమర్శ
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో విచ్చలవిడిగా అవినీతి జరుగుతున్నా చంద్రబాబు మాత్రం అవినీతిరహిత పాలన అందిస్తున్నామనడం విడ్డూరమని వైఎస్సార్‌సీపీ నేత బొత్స సత్యనారాయణ అన్నారు. ‘అసలు అవినీతిరహిత పాలన అనేది పచ్చి బూతు’ అని టీడీపీ సర్కారును విమర్శించారు. హైదరాబాద్‌లోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో శనివారం మీడియాతో మాట్లాడిన ఆయన.. పరిపాలనతో చంద్రబాబు పూర్తిగా విఫలమయ్యారని అన్నారు.
‘టీడీపీ మహానాడు జరుగుతోన్న విశాఖపట్నంలోనే చంద్రబాబు కుటుంబం భూ అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. రుణమాఫీ, ఎన్టీఆర్ సుజల స్రవంతి, ధరల స్థిరీకరణ తదితర నిధులు ఎటు మళ్లుతున్నాయో తెయని పరిస్థితి. కేంద్రం ఇచ్చానని చెప్పిన రూ. 1.75కోట్లు ఎటు వెళ్లాయి? ఎక్కడికక్కడ కాకి లెక్కలు చెప్పడమేనా అవినీతిరహిత పాలన అంటే?’ అని బొత్స మండిపడ్డారు.
ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్నవన్నీ ప్రభుత్వ హత్యలేనన్న బొత్స.. తగిన మూల్యం తప్పదని టీడీపీని హెచ్చరించారు. విశాఖలో జరుగుతున్న మహానాడులో ఆత్మస్తుతి, పరనింద తప్ప వాస్తవాలు మాట్లాడటంలేదని విమర్శించారు. మహానాడు ద్వారా ప్రజలకు వాస్తవాలు తెలియజేయాలని డిమాండ్ బొత్స సత్యనారాయణ చేశారు.