
టీడీపీ మహానాడుతో ఒరిగిందేమీ లేదు
విశాఖ : టీడీపీ మహానాడు వల్ల ప్రభుత్వ ధనం దుర్వినియోగం అయ్యిందే తప్ప, ప్రజలకు ఎలాంటి ప్రయోజనం ఒనగూడలేదని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ అన్నారు. మహానాడులో మంచి తీర్మానాలు వస్తాయని ఆశించామని, అయితే అలాంటివేమీ జరగలేదని ఆయన సోమవారమిక్కడ వ్యాఖ్యానించారు. మహానాడు పెద్ద జాతరను తలపించిందని బొత్స సత్యనారాయణ విమర్శించారు. గిట్టుబాటు ధరలు లేక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే... రూ.5వేల కోట్ల స్థిరీకరణ నిధిపై ఈ మహానాడులో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని అన్నారు.
రైతు సమస్యలు, కరవు, నిరుద్యోగ సమస్యపై చర్చేలేదని, తెలంగాణలో రైతులు ఆత్మహత్యలు చర్చించి, ఏపీని విస్మరించారని బొత్స ధ్వజమెత్తారు. రాష్ట్రంలో మిర్చి రైతులు కుదేలైపోయారని అన్నారు. ప్రతిపక్షంపై నిందలు వేయడం తప్ప... ఏం ప్రయోజనం జరగలేదని బొత్స మండిపడ్డారు. ఇక నారా లోకేశ్ వ్యాఖ్యలు పిల్ల కాకి అరుపుల్లా ఉన్నాయని ఆయన ఎద్దేవా చేశారు. అవినీతిపై చర్చకు లోకేశ్ పిలవడం విడ్డూరంగా ఉందన్నారు.
అవినీతిపై విచారణ చేయించుకున్నాక విచారణకు రావాలని, ఆ విషయం కూడా లోకేశ్‌కు తెలియకపోవడం దారుణమన్నారు. నాడు వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు చేశారని, ఆ ఆరోపణలపై వైఎస్‌ఆర్ సీబీఐ విచారణ వేశారని బొత్స ఈ సందర్భంగా గుర్తు చేశారు. టీడీపీ అవినీతిపై ప్రశ్నిస్తే ఎదురుదాడి చేయడం సిగ్గు చేటు అని అన్నారు.