డియర్ మోదీ..ఎనిమిదేళ్ల బాలుడి లెటర్
బెంగళూరుకు చెందిన ఎనిమిదేళ్ళ బాలుడు.. భారత ప్రధాని కార్యాలయానికి ఉత్తరం ఎందుకు రాయాల్సి వచ్చింది? బెంగళూరులోని ఏ పరిస్థితి... అతడిని అంతగా వేధించింది? ప్రభుత్వాల నిర్లక్ష్యం ప్రజలను ఇబ్బంది పెడుతున్న సంఘటన.. ఆ చిన్నారి హృదయాన్ని కుదిపేసింది. నిరంతరం రద్దీగా ఉండే వాయువ్య బెంగళూరులో కీలక జంక్షన్లోని గ్రిడ్ లాక్ ప్రాంతం... ప్రయాణీకుల సహనానికి పరీక్ష పెడుతుండటం ఆ పసి హృదయం తట్టుకోలేక పోయింది. అందుకు ఏం చేయాలో తీవ్రంగా ఆలోచించిన అభినవ్ చివరకు ఓ నిర్ణయానికి వచ్చాడు. దేశ ప్రధాని మోదీ కార్యాలయానికి విషయాన్ని తెలియజేయడం ఒక్కటే మార్గం అనుకున్నాడు.
బెంగళూరులోని నేషనల్ పబ్లిక్ స్కూల్లో మూడో తరగతి చదువుతున్న అభినవ్.. ప్రతిరోజూ స్కూలుకు మూడు కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సి వస్తుంది. బెంగళూరు విద్యారణ్యపుర లోని దొడ్డబొమ్మసంద్రలో అభినవ్ కుటుంబం నివసిస్తుంది. అయితే కేవలం మూడు కిలో మీటర్ల దూరంలో ఉన్న స్కూలుకు చేరేందుకు ప్రతిరోజూ కనీసం 45 నిమిషాల సమయం పడుతోంది.
అవుటర్ రింగ్ రోడ్డు దగ్గరలోని, గోరెగుంటెపాల్య జంక్షన్, రైల్వే క్రాసింగ్ ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న ఫ్లై ఓవర్.. ట్రాఫిక్ ఇబ్బందులకు కారణంగా మారింది. సమస్యను ప్రతిరోజూ కళ్ళారా చూస్తున్న అభినవ్.. పరిష్కారం కోసం పీఎం కార్యాలయానికి ఉత్తరం రాశాడు. అయితే అభినవ్ ఉత్తరానికి పీఎంవో కార్యాలయం వెంటనే స్పందించింది. బెంగళూరులో సమస్యపై తక్షణ చర్యలు తీసుకోవాలని రైల్వేశాఖను కోరింది.
రక్షణ అధికారుల ఆంక్షల వల్ల ప్రాజెక్టు నిర్మాణం తీవ్ర ఆలస్యం అవుతోంది. 'ట్రాఫిక్ సమస్య ఒక్క ప్రజారోగ్యానికి సంబంధించినదే కాదు, నా చదువును కూడ ప్రభావితం చేస్తోంది.' అంటూ అభినవ్ రాసిన ఉత్తరం... ఇప్పుడు బెంగళూరు లోని ప్రజా సమస్యను దేశ ప్రధాని దృష్టికి చేర్చింది.