బ్రాహ్మణవాదానికి ఊతం..
పుణే: కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం హిందూ జాతీయవాదం పేరుతో బ్రాహ్మణవాదాన్ని ప్రోత్సహిస్తోందని ప్రముఖ రచయిత్రి అరుంధతీ రాయ్ ధ్వజమెత్తారు. దేశంలోని మైనారిటీ ప్రజల్లో నెలకొన్న భయందోళనలను వర్ణించడానికి అసహనం వంటి పదాలు చాలవని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలపై అతివాద హిందూసంఘాలు మండిపడ్డాయి. ఆమెను జాతివ్యతిరేకి అని విమర్శించారు. అరుంధతి శనివారమిక్కడ జరిగిన కార్యక్రంలో మహాత్మా జ్యోతిబా ఫూలే సమతా అవార్డును అందుకుని ప్రసంగించారు. వేదిక వద్ద ఆమె కనిపించడంతో బీజేపీ అనుబంధ విద్యార్థి సంఘమైన ఏబీబీపీ కార్యకర్తలు గొడవ చేశారు. అవార్డు స్వీకారం తర్వాత చేసిన ప్రసంగంలో అరుంధతి.. మోదీ సర్కారుపై విమర్శలు గుప్పించారు.
‘దేశానికి చెందిన సంఘసంస్కర్తలను గొప్ప హిందువులుగా చూపేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది. హిందూమతాన్ని వదిలేసిన అంబేడ్కర్ వారిలో ఒకరు. చరిత్రను తిరగరాస్తున్నారు. జాతీయ సంస్థలను ప్రభుత్వం ఆక్రమిస్తోంది’ అని దుయ్యబట్టారు. ఎన్సీపీ నేత, మహారాష్ట్ర మాజీ మంత్రి ఛగన్ భుజ్‌బల్ ప్రసంగిస్తూ.. బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల నుంచి బీజేపీ గుణపాఠం నేర్చుకోవాలని అన్నారు. కాగా, అరుంధతి వ్యాఖ్యలపై మండిపడ్డ ఏపీబీపీ కార్యకర్తలు ఆమె జాతి వ్యతిరేకి అని, పాకిస్తాన్ అనుకూలవాది అని విమర్శించారు. వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరుంధతి దేశ ప్రజల మనోభావాలను గాయపరచారంటూ నిరసనకారులు.. కార్యక్రమాన్ని నిర్వహించిన మహాత్మా ఫూలే సమతా పరిషత్‌కు వినతిపత్రంలో ఫిర్యాదు చేశారు.