తిరుపతి సిటీ: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి బ్రెయిన్‌డెడ్ స్థితిలో ఉన్న యువకుడు బుధవారం మరో ముగ్గురి ప్రాణాలను ఆదుకున్నాడు. చిత్తూరు జిల్లా బి.కొత్తకోట మండలం దిన్నెమీదపల్లికి చెందిన రెడ్డెప్పరెడ్డి ఈనెల 21న రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. తిరుపతిలోని స్విమ్స్‌కు తీసుకువచ్చారు. వైద్యులు పరీక్షించి రెడ్డెప్పరెడ్డి తలకు బలమైన గాయాలు కావడంతో బ్రెయిన్‌డెడ్ అయినట్టు నిర్ధారించారు.
స్విమ్స్ వైద్యులు విజయవాడలోని జీవన్‌ధాన్ ఆర్గనైజేషన్ కో-ఆర్డినేటర్ డాక్టర్ మురళీకృష్ణకు సమాచారం అందించారు. వెంటనే రెడ్డెప్పరెడ్డి భార్య మాలతి, కుటుంబ సభ్యులతో సంప్రదించి అవయవ దానానికి అనుమతించాలని కోరారు. వారు అంగీకరించడంతో వైద్యులు బుధవారం రాత్రి గుండెను, రెండు కిడ్నీలను తీసుకున్నారు. గుండెను చెన్నై మిషన్ హాస్పిటల్‌కు తరలించారు. ఒక కిడ్నీని తిరుపతి స్విమ్స్‌లోని చిన్నబ్బ అనే రోగికి అమర్చనున్నట్టు వైద్యులు తెలిపారు. మరో కిడ్నీని నెల్లూరు నారాయణ మెడికల్ కళాశాలకు తరలించారు. రెడ్డెప్ప రెడ్డి భార్య మాలతి గ్రామంలోని అంగన్‌వాడీ కేంద్రంలో ఆయాగా పనిచేస్తోంది. వారికి మూడు సంవత్సరాల కుమార్తె ఉంది.
ముగ్గిరికి ప్రాణమిచ్చాడు
Published Wed, Sep 23 2015 10:54 PM | Last Updated on Mon, Aug 20 2018 9:35 PM
Advertisement