సినిమాలు చూసి ఎంతపని చేశాడు!
సినిమాలు చూసి ఎంతపని చేశాడు!
Published Tue, Oct 4 2016 8:40 PM | Last Updated on Mon, Sep 4 2017 4:09 PM
'ప్రపంచంలోనే పెద్దకండల వీరుడా?' అన్నట్లు కనిపిస్తోన్న ఇతని పేరు వాల్దిర్ సెగాటో. వయసు 48, ఊరు బ్రెజిల్ లోని సావొ పాలో. కూలినాలి చేసుకుంటూ సాధారణ జీవితం గడిపే వాల్దిర్ ది అసాధారణ లక్ష్యం. అది సాధించడానికి అతను ఎంచుకున్న మార్గం కూడా అత్యంత ప్రమాదకరం. గడిచిన కొన్నేళ్లుగా క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తోన్న వాల్దిర్.. తన బైసెప్(చేతి కండల) సైజును 23 ఇంచులకు పెంచాడు. సాధారణంగా 12 ఇంచుల సైజుండే చేతికండలు ఇంతలా పెంచడం గొప్పే కానీ ప్రపంచ రికార్డు మాత్రం కాదు.(ఈజిప్టుకు చెందిన ముస్తఫా ఇస్మాయిల్ అనే మహాబలుడి బైసెప్ సైజు 31 ఇంచులు). కనీసం 27 ఇంచుల సైజుతో అమెరికా ఖండంలోనే అతిపెద్ద బైసెప్ సాధించిన వ్యక్తిగా నిలవాలనేది వాల్దిర్ కల.
మొదట్లో సాధారణ వ్యాయామాలు చేసిన ఇతను తొందరగా కండలు పెరిగేందుకు 'synthol'అనే ఆయిల్ ను వినియోగించడం మొదలుపెట్టాడు. ప్రమాదకరమైన ఆ ఆయిల్ ను వాల్దిర్ ఇంజక్షన్ల ద్వారా నేరుగా కండల్లోకి ఎక్కించుకుంటున్నాడు. 'నేను రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్లేటప్పుడు జనం నన్ను 'హీ మ్యాన్'.. 'ఆర్నాల్ట్ ష్వార్జ్ నెగర్'.. 'హల్క్'.. అంటూ రకరకాలుగా పిలుస్తారు. ఆ పేర్లు విన్నప్పుడల్లా నా ఛాతి విచ్చుకుంటుంది. ఎందుకంటే నేను కండలు పెంచాలనుకోవడానికి కారణం.. స్ఫూర్తి.. సినిమాలే! తెరపై ష్కార్జ్ నెగర్ ను చూసి ఆయనలా కావాలనుకున్నా. 'హల్క్' చూసి మహాబలుడిగా ఎదగాలనుకున్నా. నేను వాడే ఆయిల్ ప్రమాదకరమైందని తెలుసు. కానీ అలా మారడం నా కల. దాని కోసం ఎన్ని ప్రమాదాలు ఎదుర్కోవడానికైనా సిద్ధంగా ఉన్నా. 'నని వాల్దీర్ అంటున్నాడు.
చిన్నతనంలోనే వాల్దీర్ డ్రగ్స్ బారినపడ్డాడని, కొన్నేళ్ల కిందట వాటిని మానేసి జిమ్ కు వెళ్లడం మొదలుపెట్టాడని అతని స్నేహితుడు ఫెర్నాండో డిసిల్వ పేర్కొన్నాడు. చేస్తేగీస్తే ఎక్సర్ సైజ్ తో కండలు పెంచాలిగానీ ఆయిల్ ఇంజెక్ట్ చేసుకుని పెంచకూడదని వాల్దీర్ కు ఎన్నోసార్లు చెప్పా. కానీ అతనికి అలాగే ఇష్టం. తొందరగా ఆ రికార్డేదో సాధించిన తర్వాతైన ఆ ఆయిల్ వాడకాన్ని ఆపించాలి. అప్పటిదాకా వాడు బతికుండాలని దేవుణ్ని ప్రార్థిస్తున్నా' అని ఫెర్నాడో చెప్పుకొచ్చాడు.
Advertisement
Advertisement