‘బ్రిక్స్’ తో వర్ధమాన దేశాలకు మేలు: స్టిగ్లిట్జ్
న్యూఢిల్లీ: బ్రిక్స్ కూటమి ఏర్పాటు వర్ధమాన దేశాలు చేసిన మంచి పనుల్లో ఒకటని నోబెల్ బహుమతి గ్రహీత జోసెఫ్ స్టిగ్లిట్జ్ వ్యాఖ్యానించారు. మెరుగైన వృద్ధి సాధించేందుకు ఈ దేశాల వద్ద పుష్కలంగా వనరులు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ‘అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభం-వర్ధమాన దేశాలపై ప్రభావం’ అంశంపై జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా స్టిగ్లిట్జ్ ఈ విషయాలు తెలిపారు.
భారత్‌తో పాటు ఇతర వర్ధమాన దేశాలైన బ్రెజిల్, రష్యా, చైనా, దక్షిణాఫ్రికా కలిసి బ్రిక్స్ కూటమి ఏర్పాటు చేసుకున్న సంగతి తెలిసిందే. సంపన్న దేశాల రికవరీ అంతంత మాత్రంగా ఉన్న తరుణంలో .. వర్ధమాన దేశాలు వృద్ధి కోసం వాటిపై ఆధారపడజాలవని స్టిగ్లిట్జ్ పేర్కొన్నారు. అధిక వృద్ధి సాధించేందుకు వర్ధమాన దేశాలు పరస్పరం సహకరించుకోవాలని, దేశీయ డిమాండ్‌పైన ఆధారపడాలని సూచించారు. పాశ్చా త్య దేశాలు కేవలం ద్రవ్యోల్బణ కట్టడే ధ్యేయంగా పనిచేయడం తగదని, ఉపాధి కల్పన..వృద్ధి సాధనపై మరింత దృష్టి పెట్టాలని పేర్కొన్నారు.