Joseph Stiglitz
-
ఉద్యోగాలపై ప్రఖ్యాత ఆర్థికవేత్త వ్యాఖ్యలివే..
సాక్షి, న్యూఢిల్లీ : దేశంలో పెరుగుతున్న నిరుద్యోగంపై ప్రపంచ ప్రఖ్యాత ఆర్థికవేత్త కీలక వ్యాఖ్యలు చేశారు. నిరుద్యోగం, వాతావరణ మార్పులే రాబోయే రోజుల్లో భారత్ ముందున్న అతిపెద్ద సవాళ్లని నోబెల్ గ్రహీత, ప్రముఖ ఆర్థిక వేత్త జోసెఫ్ స్టిలిట్జ్ ఆందోళన వ్యక్తం చేశారు. భారత్ నిరంతర వృద్ధి పరంపర కొనసాగిస్తూ పటిష్ట ఆర్థిక శక్తిగా ఎదిగినా ఉపాధి కల్పన మాత్రం పెను సమస్యగా పరిణమించిందన్నారు. నగర ప్రాంతంలో ఉద్యోగాలు కొంతమేర అందుబాటులోకి వచ్చినా ఇతర ప్రాంతాల్లో ఈ సవాల్‌ను అధిగమించడం సంక్లిష్టమని అన్నారు. వ్యవసాయంలో భారత్ పర్యావరణ హితమైన పద్ధతులను అనుసరించడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. రానున్న రోజుల్లో భారత ఆర్థిక వ్యవస్థకు ఇది విఘాతంగా పరిణమిస్తుందని అన్నారు. ఇండియా ఎకనమిక్ కాంక్లేవ్‌ను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. కాగా ట్రంప్ విధానాల ప్రభావం దీర్ఘకాలం కొనసాగుతుందని, అమెరికన్ సంస్థలను ఆయన విస్మరిస్తూ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. ట్రంప్ చెబుతున్న ట్రేడ్ వార్‌కు అమెరికన్ చట్టాలు అనుమతించవని స్టిలిట్జ్ స్పష్టం చేశారు. -
‘బ్రిక్స్’ తో వర్ధమాన దేశాలకు మేలు: స్టిగ్లిట్జ్
న్యూఢిల్లీ: బ్రిక్స్ కూటమి ఏర్పాటు వర్ధమాన దేశాలు చేసిన మంచి పనుల్లో ఒకటని నోబెల్ బహుమతి గ్రహీత జోసెఫ్ స్టిగ్లిట్జ్ వ్యాఖ్యానించారు. మెరుగైన వృద్ధి సాధించేందుకు ఈ దేశాల వద్ద పుష్కలంగా వనరులు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ‘అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభం-వర్ధమాన దేశాలపై ప్రభావం’ అంశంపై జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా స్టిగ్లిట్జ్ ఈ విషయాలు తెలిపారు. భారత్‌తో పాటు ఇతర వర్ధమాన దేశాలైన బ్రెజిల్, రష్యా, చైనా, దక్షిణాఫ్రికా కలిసి బ్రిక్స్ కూటమి ఏర్పాటు చేసుకున్న సంగతి తెలిసిందే. సంపన్న దేశాల రికవరీ అంతంత మాత్రంగా ఉన్న తరుణంలో .. వర్ధమాన దేశాలు వృద్ధి కోసం వాటిపై ఆధారపడజాలవని స్టిగ్లిట్జ్ పేర్కొన్నారు. అధిక వృద్ధి సాధించేందుకు వర్ధమాన దేశాలు పరస్పరం సహకరించుకోవాలని, దేశీయ డిమాండ్‌పైన ఆధారపడాలని సూచించారు. పాశ్చా త్య దేశాలు కేవలం ద్రవ్యోల్బణ కట్టడే ధ్యేయంగా పనిచేయడం తగదని, ఉపాధి కల్పన..వృద్ధి సాధనపై మరింత దృష్టి పెట్టాలని పేర్కొన్నారు. -
ద్రవ్యోల్బణంపైనే సెంట్రల్ బ్యాంకుల దృష్టి సరికాదు: మాంటెక్
న్యూఢిల్లీ: ద్రవ్యోల్బణం కట్టడే ప్రధాన లక్ష్యంగా సెంట్రల్ బ్యాంకులు పనిచేయడం సరికాదని ప్రణాళికా సంఘం డిప్యూటీ చైర్మన్ మాంటెక్ సింగ్ అహ్లువాలియా సోమవారం పేర్కొన్నారు. ఇక్కడ జరిగిన ఒక కార్యక్రమం సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. సెంట్రల్ బ్యాంకులు పలు అంశాలు లక్ష్యంగా పనిచేయాల్సి ఉంటుందన్నది తన అభిప్రాయమని అన్నారు. రఘురామ్ రాజన్ గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టిన తరువాత, ద్రవ్యోల్బణమే లక్ష్యంగా రిజర్వ్ బ్యాంక్ రెండుసార్లు రెపో రేటు పెంచిన నేపథ్యంలో మాంటెక్ ప్రకటనకు ప్రాధాన్యత సంతరించుకుంది. పారిశ్రామిక ఉత్పత్తి క్షీణదశలో నడుస్తున్న నేపథ్యంలో- జనవరి 28వ తేదీన ఆర్బీఐ తన మూడవ త్రైమాసిక పరపతి విధాన సమీక్షను నిర్వహించనుంది. ఆర్థిక రంగంలో సంస్కరణల ప్రక్రియ కొనసాగాల్సిన అవసరం ఉందని ఆయన ఈ సందర్భంగా అన్నారు. రూపాయి ప్రస్తుతం (సోమవారం 61.52 వద్ద స్థిరపడింది) తన వాస్తవ విలువ దగ్గరగా ఉందని మాంటెక్ తెలిపారు.