విమానం దిగుతోంది.. గేరు విరిగింది!
జోహాన్నెస్బర్గ్: గత కొంతకాలంగా విమాన ప్రమాదాలు తరచూ జరుగుతున్నాయి. విమానం ఎక్కినప్పటి నుంచి మళ్ళీ క్షేమంగా దిగేవరకు ప్రయాణికులు బిక్కుబిక్కుమంటూ గడపవాల్సిన పరిస్థితులు నెలకొంటున్నాయి. తాజాగా సోమవారం బ్రిటిష్ ఎయిర్ వేస్ కు చెందిన ఓ విమానం ల్యాండ్ అవుతుండగా గేర్ విరిగిపోయింది. దీంతో విమానం బలంగా రన్ వేను తాకింది.
అయినప్పటికీ పైలట్లు అప్రమాత్తంగా ఉండటంతో పెద్ద ప్రమాదం తప్పింది. జోహాన్నెస్బర్గ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో సోమవారం ఉదయం ఈ ఘటన జరిగింది. ఈ సమయంలో విమానంలో 94 మంది ప్రయాణికులు ఉన్నారు. కానీ, ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదని పైలట్ వారెన్ మాన్ తెలిపారు. విమానం రన్ వేపై ఒక్కసారిగా ఒరగడం వల్ల ఎడమ గేర్ విరిగిందని తెలిసింది. దీంతో ఒక్కసారిగా విమానంలో ప్రకంపనలు వచ్చాయి. దీనిని గమనించిన రెస్క్యూ టీమ్ వెంటనే ప్రయాణికులను అత్యవసర స్లైడ్స్ ద్వారా కిందకు దించారు. దీనిపై విమాన అధికారులు సమగ్ర విచారణకు ఆదేశించారు.