సంఘ్ ఖాకీ నిక్కర్ అవుట్ | Brown trousers to replace khaki shorts for swayamsevaks | Sakshi
Sakshi News home page

సంఘ్ ఖాకీ నిక్కర్ అవుట్

Published Mon, Mar 14 2016 1:58 AM | Last Updated on Sun, Sep 3 2017 7:40 PM

సంఘ్ ఖాకీ నిక్కర్ అవుట్

సంఘ్ ఖాకీ నిక్కర్ అవుట్

ఆరెస్సెస్ నిర్ణయం
ఇక యూనిఫాంలో గోధుమరంగు ప్యాంటు
కాలానికి తగ్గట్లు మారుతున్నామన్న భయ్యాజీ

 
నాగౌర్(రాజస్తాన్): రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆరెస్సెస్) అంటే ముందుగా గుర్తొచ్చేది వదులుగా ఉండే ఖాకీ నిక్కర్, తెల్లచొక్కా యూనిఫాం. 91 ఏళ్లుగా ట్రేడ్‌మార్క్‌గా ఉన్న ఖాకీ నిక్కర్‌ను మారుస్తూ ఆరెస్సెస్ సంచలన నిర్ణయం తీసుకుంది. దీని స్థానంలో గోధుమరంగు ప్యాంటును తెస్తున్నట్లు ప్రకటించింది. ఆరెస్సెస్ మూడురోజుల మేధోమథన సదస్సు ఆదివారమిక్కడ ముగిసింది. 1925లో ఆరంభమైన ఆరెస్సెస్ యూనిఫాంలో చిన్నచిన్న మార్పులు జరిగినప్పటికీ ఖాకీ నిక్కర్ ఇప్పటిదాకా మారలేదు. దీనిపై ఆరెస్సెస్ ప్రధాన కార్యదర్శి సురేశ్ భయ్యాజీ మాట్లాడుతూ, తాము తీసుకున్న నిర్ణయాల్లో ఇదే పెద్ద నిర్ణయమన్నారు. తాము కాలానికి తగ్గట్లు మారతామని, మారకపోతే ఏ సంస్థ కూడా పురోగతి సాధించలేదన్నారు. యువతను ఆకర్షించి సభ్యత్వాలను పెంచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. గోధుమ రంగును ఖరారు చేయడం వెనుక ఎలాంటి ప్రత్యేక కారణం లేదని, అది ఎప్పుడూ అందుబాటులో ఉండటంతోపాటు చూడ్డానికి బాగుంటుందని పేర్కొన్నారు.

మహిళలకూ ఆలయ ప్రవేశం
ఏ ఆలయంలోనైనా మహిళలను అనుమతించకపోవడం అసంబద్ధమని, ఆలయ నిర్వాహకులు తమ ధోరణిని మార్చుకోవాలని ఆరెస్సెస్ సూచించింది. శని శింగ్నాపూర్, త్రయంబకేశ్వర్ ఆలయాల్లోకి మహిళలను అనుమతించకపోవడంతో పెద్దఎత్తున ఆందోళనలు జరిగిన విషయం తెలిసిందే. కొన్ని ప్రాంతాల్లోని అనుచిత సంప్రదాయాలతోపాటు, మహిళల ఆలయ ప్రవేశంపై ఏకాభిప్రాయం లేకపోవడం వల్లనే ఇలా జరుగుతోందని భయ్యాజీ చెప్పారు. ఇది చాలా సున్నితమైన అంశమని, చర్చల ద్వారా పరిష్కరించుకోవాలే గానీ, ఆందోళనలతో కాదన్నారు. మహిళలు కూడా వేదాలు నేర్చుకుంటున్నారని, మతపరమైన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని చెప్పారు.
 
సంపన్నులకు కోటా వద్దు

సంపన్న వర్గాలు రిజర్వేషన్ల కోసం ఉద్యమించడాన్ని సమర్థించబోమని సంఘ్ నేత భయ్యాజీ చెప్పారు. వారు వెనుకబడిన వర్గాలుగా కోటా ప్రయోజనాలు పొందాలంటే, దీనిపై సమగ్ర అధ్యయనం జరగాలన్నారు. అంబేడ్కర్ సామాజిక న్యాయం ఆధారంగా రిజర్వేషన్లు కల్పించారని, రిజర్వేషన్లపై డిమాండ్ చేసేవారు దీన్ని దృష్టిలో పెట్టుకోవాలన్నారు. సంపన్న వర్గాలు రిజర్వేషన్లు పొందుతోంటే గనుక ఆ హక్కును వదులుకొని, బలహీన వర్గాలకు సాయం చేయాలన్నారు.  
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement