జమ్మూ: పాకిస్తాన్ భూభాగం నుంచి జమ్మూ కశ్మీర్‌కు తవ్విన 14 అడుగుల సొరంగ మార్గం వెలుగుచూసింది. ఆర్నియా సెక్టార్‌లోని శూన్యరేఖ సమీపంలో సరిహద్దు భద్రతా దళం (బీఎస్‌ఎఫ్) శనివారం దీన్ని గుర్తించింది. దీంతో భారత్‌లోకి చొరబాటు, ఉగ్రదాడి యత్నాలను భగ్నం చేసినట్లయిందని అధికారులు వెల్లడించారు. శూన్యరేఖ వద్ద కొందరు సాయుధులు బీఎస్‌ఎఫ్ బృందాన్ని చూసి పారిపోవడంతో అనుమానమొచ్చి, క్షుణ్నంగా తనిఖీ చేయగా ఈ సొరంగ మార్గం బయటపడింది.
అక్కడ పాకిస్తాన్‌లో తయారైన ఆహారపదార్థాలు దొరకడంతో సాధ్యమైనంత తొందరగా సొరంగ నిర్మాణాన్ని పూర్తిచేసి భారత్‌లో ఉగ్రదాడులకు పాల్పడాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ‘సరిహద్దు కంచెకు సమీపంలోని ధమల్లా నల్లా ఒడ్డుపై ఇంకా నిర్మాణ దశలోనే ఉన్న ఈ సొరంగం ఎత్తు 3 అడుగులు. వెడల్పు రెండున్నర అడుగులు. బీఎస్‌ఎఫ్ గస్తీ బృందానికి అనుమానమొచ్చి తనిఖీలు చేపట్టగా సొరంగ మార్గం బయటపడింది. ఘటనా స్థలంలో అమెరికాలో తయారైన మార్గసూచి, రెండు మేగజీన్లు, 60 రౌండ్ల మందుగుండు సామగ్రి, హ్యాండ్ గ్రెనేడ్, పాకిస్తాన్ గుర్తులున్న మరిన్ని వస్తువులను కనుగొన్నాం’ అని బీఎస్‌ఎఫ్ ఐజీ అవతార్ చెప్పారు.
పాక్ రేంజర్ల కనుసన్నల్లోనే!
సొరంగ తవ్వకం పాకిస్తాన్ కుట్రేనన్న అవతార్, సమయానికి దాన్ని గుర్తించి భారత్‌లో ఉగ్రదాడులను నివారించామని చెప్పారు. అప్పుడే పెకిలించిన మట్టి, తవ్విన దూరాన్ని బట్టి చూస్తే సొరంగ నిర్మాణం 3 రోజుల క్రితమే ప్రారంభమై ఉంటుందన్నారు. ఈ సొరంగానికి ప్రవేశం పాకిస్తాన్‌లో ఉండగా, డెడ్‌ఎండ్... ఫెన్సింగ్, శూన్యరేఖ మధ్య ఉందని తెలిపారు. సొరంగ తవ్వకం గురించి పాకిస్తాన్ రేంజర్లకు తెలిసే ఉంటుందని అన్నారు. తవ్వకానికి ఉపయోగించిన పనిముట్లను బట్టి దీనికోసం నిపుణుల సేవలను వినియోగించుకున్నట్లు తెలుస్తోందని అన్నారు. ‘సొరంగం తవ్వకానికి ఎంచుకున్న ప్రదేశం, వాడిన పనిముట్లను బట్టి దీని కోసం నిపుణులను నియమించుకున్నట్లు అర్థమవుతోంది. నడుము వరకు వంగితే ఎవరైనా దీని గుండా నడవొచ్చు’ అని తెలిపారు.