బుక్కాపురం టు మైక్రోసాఫ్ట్‌ | Bukkapuram to Microsoft: journey of Satya Nadella | Sakshi
Sakshi News home page

బుక్కాపురం టు మైక్రోసాఫ్ట్‌

Published Sun, Mar 5 2017 10:33 PM | Last Updated on Tue, Sep 5 2017 5:17 AM

బుక్కాపురం టు మైక్రోసాఫ్ట్‌

బుక్కాపురం టు మైక్రోసాఫ్ట్‌

ప్రపంచంలోనే ప్రఖ్యాత ఐటీ కంపెనీ మైక్రోసాఫ్ట్‌కు ఆయన బాస్‌. సాంకేతిక నిపుణుడు, ఆలోచనపరుడు, ఆత్మవిశ్వాసంగల నాయకుడు. అందరితో సత్సబంధాలు ఏర్పరుచుకోవడంలో ఆయన దిట్ట. సాదాసీదాగా ఉంటూ ఎదుటివారు చెప్పేది శ్రద్ధగా వింటారు. అదే ఆయనను ఉన్నత శిఖరాలకు చేర్చింది. ఆయన మరెవరో కాదు సత్యనాదెళ్ల. తెలుగు గడ్డపై పుట్టి మన ఖ్యాతిని ప్రపంచం నలుమూలలా తెలిసేలా చేశాడు. మరి ఆయనకు సంబంధించిన మరిన్ని విషయాలను ఈ రోజు పర్సనాలిటీలో భాగంగా తెలుసుకుందాం..!

సత్య నాదెళ్ల పూర్తి పేరు సత్యనారాయణ నాదెళ్ల. ప్రపంచంలోనే ప్రఖ్యాతి సాఫ్ట్‌వేర్‌ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌ సంస్థకు చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ గా 2014 ఫిబ్రవరి 4 న నియమితులయ్యారు. అంతకుముందు ఆయన మైక్రోసాఫ్ట్‌లో క్లౌడ్‌ అండ్‌ ఎంటర్‌ప్రైజెస్‌ విభాగానికి ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌గా ఉన్నారు.  1976 నుంచి సంస్థ సహ వ్యవస్థాపకుడు బిల్‌ గేట్స్, స్టీవ్‌ బాల్మేర్‌ తర్వాత మూడవ సీఈఓగా సత్య నాదెళ్ల బాధ్యతలు చేపట్టారు. ఇటువంటి గొప్ప అవకాశం భారతీయులకు, అందులోనూ తెలుగువాళ్లకు లభించడం మనం గర్వించదగిన విషయం. సీఈఓ ఎంపిక కోసం సంస్థ ఐదు నెలల పాటు కసరత్తు చేసి మరీ సత్యను ఎంపిక చేసింది.

హైదరాబాద్‌లోనే చదువు..
సత్యనాదెళ్ల తల్లిదండ్రులు అనంతపురం జిల్లాలోని బుక్కాపురం అనే కుగ్రామానికి చెందినవారు. సత్య తండ్రి నాదెళ్ల యుగంధర్‌ 1962 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారి. రాష్ట్రంలో మంచి అధికారిగా పేరుతెచ్చుకున్నారు. ఆయన తండ్రి ఐఏఎస్‌కు ఎంపికైన తర్వాత కుటుంబాన్ని హైదరాబాద్‌కు మార్చారు. 1967లోనే హైదరాబాద్‌లో పుట్టిన సత్య ప్రాథమిక విద్యాభ్యాసమంతా హైదరాబాద్‌ పబ్లిక్‌ స్కూల్లో జరిగింది. క్రికెట్‌ అంటే మహా ఇష్టం. స్కూల్‌ క్రికెట్‌ జట్టులో సత్య కూడా సభ్యుడే. బృందంతో సమన్వయంగా వ్యవహరించడం, నాయకత్వ లక్షణాలను క్రికెట్‌ నుంచే నేర్చుకున్నట్లు ఆయన ఇప్పటికీ చెబుతుంటారు.

పాఠశాల విద్య పూర్తయిన తర్వాత మణిపాల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ నుంచి 1988లో ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌లో బీఈ పట్టా పుచ్చుకున్నారు. అమెరికాలోని విస్కాన్సిన్‌ యూనివర్సిటీ నుంచి కంప్యూటర్‌ సైన్స్‌లో మాస్టర్స్‌ డిగ్రీ, చికాగో యూనివర్సిటీ నుంచి బిజినెస్‌ అడ్మినిస్ట్రేషన్‌లోనూ మాస్టర్స్‌ డిగ్రీ చేశారు. అనంతరం సాఫ్ట్‌వేర్‌ రంగంలో పలు హోదాల్లో పనిచేశారు. అమెరికా పౌరసత్వం తీసుకుని అక్కడే స్థిరపడ్డారు. కొంతకాలం సన్‌ మైక్రో సిస్టమ్స్‌లో పనిచేసిన తర్వాత 1992లో మైక్రోసాఫ్ట్‌లోకి అడుగుపెట్టారు.

మైక్రోసాఫ్ట్‌ ప్రస్థానం
సత్య నాదెళ్ల 1992లో మైక్రోసాఫ్ట్‌ విండస్‌ డెవలప్‌మెంట్‌ విభాగంలో ప్రోగ్రామ్‌ మేనేజర్‌గా చేరారు. అనంతరం 1999లో మైక్రోసాఫ్ట్‌ బీసెంట్రల్‌ విభాగానికి ఉపాధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. 2001లో మైక్రోసాఫ్ట్‌ బిజెనెస్‌ సొల్యూషన్స్‌ విభాగానికి కార్పొరేట్‌ వైస్‌ ప్రెసిడెంట్‌గా ఎంపికైన ఆయన 2007లో ఆన్‌లైన్‌ సేవల విభాగానికి సీనియర్‌ ఉప్యాధ్యక్షుడు అయ్యారు. 2011లో మైక్రోసాఫ్ట్‌ సర్వర్‌ అండ్‌ టూల్స్‌ వాణిజ్య విభాగానికి అధ్యక్షుడిగా వివిధ హోదాల్లో సేవలందించారు. తర్వాత 2014లో ఏకంగా కంపెనీ సీఈఓ బాధ్యతలను స్వీకరించి ఆ పదవిని సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు. 

మైక్రోసాఫ్ట్‌లో క్లౌడ్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌ను రూపొందించిన ఘనత సత్య నాదెళ్లదే.  పలు అంతర్జాతీయ కంపెనీల అధునాతన సాఫ్ట్‌వేర్‌ ప్రోగ్రామ్‌ల నిర్వహణకూ ఇదే కీలకం అయింది. అంతేగాక మైక్రోసాఫ్ట్‌లో 20 బిలియన్‌ డాలర్ల వ్యాపారమైన సర్వర్‌ అండ్‌ టూల్స్‌ విభాగానికి అధిపతిగా ఆయన దాన్ని పూర్తిగా పునర్వ్యవస్థీకరించారు. ఆన్‌లైన్‌ సర్వీసెస్‌ డివిజన్, బిజినెస్‌ డివిజన్‌లలో ఆయన గతంలో వైస్‌ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. మైక్రోసాఫ్ట్‌ సంస్థ కొత్త మార్పులకు లోనవుతున్న తరుణంలో .. సంస్థను ముందుంచి నడిపేందుకు సత్యను మించి మరొకరు లేరంటూ బిల్‌ గేట్స్‌ కితాబిచ్చారు.  

వ్యక్తిగత జీవితం
మరో ఐఏఎస్‌ కూతురు, హైదరాబాద్‌ పబ్లిక్‌ స్కూల్‌ లోనే చదివిన అనుపమను సత్య పెళ్ళి చేసుకున్నారు. వీరికి ఇద్దరు అమ్మాయిలు, ఓ అబ్బాయి. సత్య ప్రస్తుతం వాషింగ్టన్‌లో నివసిస్తున్నారు. కాగా ఈయన తల్లిదండ్రులు హైదరాబాద్‌లోనే ఉంటున్నారు. పుస్తకాలు చదవడం, ఆన్‌లైన్‌ కోర్సులు పూర్తి చేయడంపై సత్య ఆసక్తి చూపుతుంటారు. ఎప్పుడూ కొత్త విషయాలను తెలుసుకుంటూ ఉండకపోతే గొప్ప పనులు చేయలేమన్నది ఆయన విశ్వాసం. తన కుమారుడికి బుద్ధిమాంద్యం ఉండటంతో అలాంటి పిల్లల కోసం హైదరాబాద్‌లో పాఠశాల పెట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement