bukkapuram
-
19 గొర్రె పిల్లల అనుమానాస్పద మృతి
యల్లనూరు (శింగనమల) : యల్లనూరు మండలం బుక్కాపురంలో 19 గొర్రె పిల్లలు శుక్రవారం ఉదయం అనుమానాస్పద స్థితిలోమృతి చెందాయి. గొర్రెల కాపరి శ్రీనివాసులు సమాచారం మేరకు మండల పశువైద్యాధికారి శివసాగర్‌రెడ్డి సంఘటన స్థలానికి చేరుకుని పోస్టుమార్టం నిర్వహించారు. అవి ఏ కారణంతో చనిపోయాయో నిర్ధారించేందు కోసం వాటి నమూనాలను జిల్లా కేంద్రంలోని పశుసంవర్ధక శాఖ కార్యాలయానికి పంపినట్లు పశువైద్యాధికారి తెలిపారు. -
బుక్కాపురం టు మైక్రోసాఫ్ట్
ప్రపంచంలోనే ప్రఖ్యాత ఐటీ కంపెనీ మైక్రోసాఫ్ట్‌కు ఆయన బాస్. సాంకేతిక నిపుణుడు, ఆలోచనపరుడు, ఆత్మవిశ్వాసంగల నాయకుడు. అందరితో సత్సబంధాలు ఏర్పరుచుకోవడంలో ఆయన దిట్ట. సాదాసీదాగా ఉంటూ ఎదుటివారు చెప్పేది శ్రద్ధగా వింటారు. అదే ఆయనను ఉన్నత శిఖరాలకు చేర్చింది. ఆయన మరెవరో కాదు సత్యనాదెళ్ల. తెలుగు గడ్డపై పుట్టి మన ఖ్యాతిని ప్రపంచం నలుమూలలా తెలిసేలా చేశాడు. మరి ఆయనకు సంబంధించిన మరిన్ని విషయాలను ఈ రోజు పర్సనాలిటీలో భాగంగా తెలుసుకుందాం..! సత్య నాదెళ్ల పూర్తి పేరు సత్యనారాయణ నాదెళ్ల. ప్రపంచంలోనే ప్రఖ్యాతి సాఫ్ట్వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సంస్థకు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా 2014 ఫిబ్రవరి 4 న నియమితులయ్యారు. అంతకుముందు ఆయన మైక్రోసాఫ్ట్‌లో క్లౌడ్ అండ్ ఎంటర్ప్రైజెస్ విభాగానికి ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్‌గా ఉన్నారు. 1976 నుంచి సంస్థ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్, స్టీవ్ బాల్మేర్ తర్వాత మూడవ సీఈఓగా సత్య నాదెళ్ల బాధ్యతలు చేపట్టారు. ఇటువంటి గొప్ప అవకాశం భారతీయులకు, అందులోనూ తెలుగువాళ్లకు లభించడం మనం గర్వించదగిన విషయం. సీఈఓ ఎంపిక కోసం సంస్థ ఐదు నెలల పాటు కసరత్తు చేసి మరీ సత్యను ఎంపిక చేసింది. హైదరాబాద్‌లోనే చదువు.. సత్యనాదెళ్ల తల్లిదండ్రులు అనంతపురం జిల్లాలోని బుక్కాపురం అనే కుగ్రామానికి చెందినవారు. సత్య తండ్రి నాదెళ్ల యుగంధర్ 1962 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి. రాష్ట్రంలో మంచి అధికారిగా పేరుతెచ్చుకున్నారు. ఆయన తండ్రి ఐఏఎస్‌కు ఎంపికైన తర్వాత కుటుంబాన్ని హైదరాబాద్‌కు మార్చారు. 1967లోనే హైదరాబాద్‌లో పుట్టిన సత్య ప్రాథమిక విద్యాభ్యాసమంతా హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో జరిగింది. క్రికెట్ అంటే మహా ఇష్టం. స్కూల్ క్రికెట్ జట్టులో సత్య కూడా సభ్యుడే. బృందంతో సమన్వయంగా వ్యవహరించడం, నాయకత్వ లక్షణాలను క్రికెట్ నుంచే నేర్చుకున్నట్లు ఆయన ఇప్పటికీ చెబుతుంటారు. పాఠశాల విద్య పూర్తయిన తర్వాత మణిపాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి 1988లో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్లో బీఈ పట్టా పుచ్చుకున్నారు. అమెరికాలోని విస్కాన్సిన్ యూనివర్సిటీ నుంచి కంప్యూటర్ సైన్స్‌లో మాస్టర్స్ డిగ్రీ, చికాగో యూనివర్సిటీ నుంచి బిజినెస్ అడ్మినిస్ట్రేషన్‌లోనూ మాస్టర్స్ డిగ్రీ చేశారు. అనంతరం సాఫ్ట్వేర్ రంగంలో పలు హోదాల్లో పనిచేశారు. అమెరికా పౌరసత్వం తీసుకుని అక్కడే స్థిరపడ్డారు. కొంతకాలం సన్ మైక్రో సిస్టమ్స్‌లో పనిచేసిన తర్వాత 1992లో మైక్రోసాఫ్ట్‌లోకి అడుగుపెట్టారు. మైక్రోసాఫ్ట్ ప్రస్థానం సత్య నాదెళ్ల 1992లో మైక్రోసాఫ్ట్ విండస్ డెవలప్మెంట్ విభాగంలో ప్రోగ్రామ్ మేనేజర్‌గా చేరారు. అనంతరం 1999లో మైక్రోసాఫ్ట్ బీసెంట్రల్ విభాగానికి ఉపాధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. 2001లో మైక్రోసాఫ్ట్ బిజెనెస్ సొల్యూషన్స్ విభాగానికి కార్పొరేట్ వైస్ ప్రెసిడెంట్‌గా ఎంపికైన ఆయన 2007లో ఆన్లైన్ సేవల విభాగానికి సీనియర్ ఉప్యాధ్యక్షుడు అయ్యారు. 2011లో మైక్రోసాఫ్ట్ సర్వర్ అండ్ టూల్స్ వాణిజ్య విభాగానికి అధ్యక్షుడిగా వివిధ హోదాల్లో సేవలందించారు. తర్వాత 2014లో ఏకంగా కంపెనీ సీఈఓ బాధ్యతలను స్వీకరించి ఆ పదవిని సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు. మైక్రోసాఫ్ట్‌లో క్లౌడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌ను రూపొందించిన ఘనత సత్య నాదెళ్లదే. పలు అంతర్జాతీయ కంపెనీల అధునాతన సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్‌ల నిర్వహణకూ ఇదే కీలకం అయింది. అంతేగాక మైక్రోసాఫ్ట్‌లో 20 బిలియన్ డాలర్ల వ్యాపారమైన సర్వర్ అండ్ టూల్స్ విభాగానికి అధిపతిగా ఆయన దాన్ని పూర్తిగా పునర్వ్యవస్థీకరించారు. ఆన్లైన్ సర్వీసెస్ డివిజన్, బిజినెస్ డివిజన్లలో ఆయన గతంలో వైస్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. మైక్రోసాఫ్ట్ సంస్థ కొత్త మార్పులకు లోనవుతున్న తరుణంలో .. సంస్థను ముందుంచి నడిపేందుకు సత్యను మించి మరొకరు లేరంటూ బిల్ గేట్స్ కితాబిచ్చారు. వ్యక్తిగత జీవితం మరో ఐఏఎస్ కూతురు, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ లోనే చదివిన అనుపమను సత్య పెళ్ళి చేసుకున్నారు. వీరికి ఇద్దరు అమ్మాయిలు, ఓ అబ్బాయి. సత్య ప్రస్తుతం వాషింగ్టన్లో నివసిస్తున్నారు. కాగా ఈయన తల్లిదండ్రులు హైదరాబాద్‌లోనే ఉంటున్నారు. పుస్తకాలు చదవడం, ఆన్లైన్ కోర్సులు పూర్తి చేయడంపై సత్య ఆసక్తి చూపుతుంటారు. ఎప్పుడూ కొత్త విషయాలను తెలుసుకుంటూ ఉండకపోతే గొప్ప పనులు చేయలేమన్నది ఆయన విశ్వాసం. తన కుమారుడికి బుద్ధిమాంద్యం ఉండటంతో అలాంటి పిల్లల కోసం హైదరాబాద్‌లో పాఠశాల పెట్టారు. -
అదుపు తప్పిన అరటి వ్యాన్ బోల్తా
తాడిపత్రి/యల్లనూరు: యల్లనూరు మండల బుక్కాపురం వద్ద ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో 12 మంది గాయపడ్డారు. అరటి గెలలను కత్తిరించేందుకు కూలీలతో వచ్చిన వ్యాన్ రామలింగాయపల్లి నుంచి తిమ్మంపల్లికి వెళ్తుండగా మార్గమధ్యంలో రోడ్డుపైనున్న గుంతను తప్పించే ప్రయత్నంలో వాహనం బోల్తాపడింది. అదులో ప్రయాణిస్తున్న 12 మందికి గాయాలయ్యాయి. వారిలో ఉత్తరప్రదేశ్‌కు చెందిన రాహుల్‌కుమార్(18), నసీం అహమ్మద్(20), రాంభజన్(50), అరవింద్ కుమార్(25), రోహిత్‌కుమార్(30), రాంసమీర్(50), అనిరుధ్(21), జితేందర్(30), తజుంబల్(22) సహా యల్లనూరు మండలం తిమ్మంపల్లికి చెందిన కుళ్లాయప్ప(20), చెన్నైకు చెందిన వాహన డ్రైవర్ లైలాస్వామి, మణి గాయపడ్డారు. వారిలో రాహుల్‌కుమార్, నసీం అహమ్మద్, రాంభజన్, అరవింద్ కుమార్, రోహిత్‌కుమార్ పరిస్థితి విషమంగా ఉంది. రామలింగాయపల్లిలో అరటికాయల గెలలను కత్తిరించి వాటిని ప్యాంకింగ్ చేసిన తర్వాత చెన్నైకు తరలించాల్సి ఉంది. ఉత్తర ప్రదేశ్‌కు చెందిన కార్మికులు తిమ్మంపల్లిలో గది అద్దెకు తీసుకొని సమీప గ్రామాల్లో అరటి గెలలను కత్తిరించి, వాటిని ప్యాంకింగ్ చేసేందుకు చెన్నైకు చెందిన కాంట్రాక్టర్ పనికి పెట్టుకున్నాడు. రోజులాగే ఆదివారం కూడా అరటి గెలలను కత్తిరించి, తిరిగి తిమ్మంపల్లిలో దింపేందుకు వ్యాన్ రామలింగాయపల్లి నుంచి బయలుదేరగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. రంగంలోకి పోలీసులు సమాచారం అందిన వెంటనే పోలీసులు రంగంలోకి దిగారు. వెంటనే ఘటనా స్థలికి చేరుకుని క్షతగాత్రులను 108తో పాటు ఇతర ప్రైవేటు వాహనాల్లో తాడిపత్రి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరిస్థితి సీరియస్‌గా ఉన్న వారిని మెరుగైన వైద్యం కోసం డీఎస్పీ చిదానందరెడ్డి దగ్గరుండి అనంతపురం తరలించారు. ఘటనపై యల్లనూరు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. బాష రాక క్షతగాత్రులు తమ చిరునామాలు కూడా సరిగా చెప్పలేకపోయారు. -
బుక్కాపురంలో మహిళా బ్యాంక్
వెల్దుర్తి రూరల్ : మండల పరిధిలోని బుక్కాపురంలో గురువారం మహిళా బ్యాంక్‌ను ఏర్పాటు చేశారు. గ్రామీణ పేదరిక నిర్మూలనా సంస్థ(సెర్ప్) గౌరవ సలహాదారురాలు విజయభారతి, గ్రామాన్ని దత్తత తీసుకున్న ఢిల్లీ ఇంటర్ గ్లోబ్ ఫౌండేషన్ నిర్వాహకులు రోహిణీ, నీలాంజన్లు పొదుపు మహిళలకు ప్రత్యేక కార్యాలయం, అందులో కుట్టుశిక్షణా కేంద్రం, కంప్యూటర్ సెంటర్‌ను ప్రారంభించారు. పొదుపు మహిళల డిపాజిట్లతో(20మంది ఒకొక్కరు రూ.5,200లు) మహిళాబ్యాంకును ఏర్పాటు చేశారు. గ్రామంలో వర్మీ కంపోస్ట్ యూనిట్లను ప్రారంభించారు. అనంతరం గ్రామ సచివాలయ ఆవరణలో స్వయం సహాయక మహిళా సంఘాలతో సమావేశమయ్యారు. ఎంపీడీఓ అబ్దుల్ వహీద్, ఉపాధి ఏపీడీ పద్మావతి, ఏపీఓ లక్ష్మన్న, ఆర్‌డబ్లూ్యఎస్ ఏఈ ప్రవీష, సర్పంచ్ రాజమ్మ పాల్గొన్నారు.