గోల్డ్ అమ్మేస్తే ఓకే! | Buy gold in low price you can sell it! | Sakshi
Sakshi News home page

గోల్డ్ అమ్మేస్తే ఓకే!

Published Sun, Sep 1 2013 12:27 AM | Last Updated on Fri, Sep 1 2017 10:19 PM

గోల్డ్ అమ్మేస్తే ఓకే!

గోల్డ్ అమ్మేస్తే ఓకే!

  • బంగారాన్ని తక్కువలోకొన్నవారికిది మంచి సమయం
  •    లాభం వస్తే కొంత క్యాష్ చేసుకోండి...
  •    అంతర్జాతీయంగా పెరిగే అవకాశం తక్కువే
  •    వ్యవస్థ గాడిలో పడితే రూపాయి బలపడుతుంది
  •    అప్పుడు దేశీయంగా ధర తగ్గే అవకాముంది  
  •    బంగారంపై నిపుణుల అంచనాలివీ...
  •  
     తగ్గుతోందిగా.. ఇంకా తగ్గుతుంది లే. మరింత తగ్గితే మరింత కొనుక్కుందాం!! అనుకున్న వారిని వెక్కిరిస్తూ అందనంత దూరానికి వెళ్ళి కూర్చుంది బంగారం. కొత్త గరిష్ట స్థాయిని తాకుతున్న బంగారాన్ని కొనాలా ...లేక ఉన్న బంగారాన్ని అమ్మేసుకోవాలా? ఏం చేయాలి? అన్నది ఇన్వెస్టర్ల మనసులను తొలుస్తున్న ప్రశ్న. మరి దీనికి సమాధానమేంటి? నిపుణులు ఏమంటున్నారు? ఇదే ఈ వారం ‘ప్రాఫిట్’ ప్రధాన కథనం...
     
     దేశీయ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కేవలం రెండు నెలల్లో బంగారం ధర 36 శాతానికి పైగా పెరిగింది. జూన్‌లో పదిగ్రాముల బంగారం ధర రూ.25,000 దగ్గరకు వచ్చినట్లు వచ్చి ఇంకా తగ్గే అవకాశం ఉందన్న సంకేతాలనిచ్చింది. అంతలోనే యూటర్న్ తీసుకొని ఎవ్వరికీ అవకాశం ఇవ్వకుండా రూ.34,000 స్థాయికి వెళ్ళి కూర్చుంది. ఈ రెండు నెలల్లో బంగారం విలువ పరంగా రూ.9,000, అదే శాతాల్లో అయితే 36 శాతం పెరిగి సరికొత్త రికార్డును సృష్టించింది. అయితే ఇదే సమయంలో అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర పెరుగుదల 17 శాతమే ఉంది. ఊహించని రీతిలో రూపాయి క్షీణించడానికి తోడు ప్రభుత్వం బంగారం దిగుమతిపై సుంకాలు పెంచడంతో దేశీయంగా బంగారం ధర కొత్త గరిష్ట స్థాయిలను తాకింది. అంతర్జాతీయంగా చూస్తే మాత్రం 2011 నాటి గరిష్ట స్థాయి 1,900 డాలర్లకు ఇంకా 26 శాతం దిగువనే ట్రేడవుతోంది పసిడి. దేశీయంగా రూపాయి విలువ గనక పెరగడం మొదలైతే ఆ మేరకు బంగారం ధరలు క్షీణిస్తాయంటున్నారు నిపుణులు.
     
     అమ్మకానికే మొగ్గు: నిన్న మొన్నటి దాకా బంగారం ధర పెరుగుతుంటే ఇంకా పెరుగుతుందన్న భయంతో కొనుగోళ్లు చేసేవారని, కానీ ఇప్పుడు దానికి భిన్నంగా వాళ్ల దగ్గర ఉన్న బంగారాన్ని కూడా అమ్మేస్తున్నారని బంగారం వర్తకులు చెబుతున్నారు. ఇలా పాత బంగారాన్ని వినియోగదారులు అమ్మటమనేది గడిచిన రెండు వారాల్లో 20 శాతం వరకు పెరిగినట్లు అంచనా. సాధారణంగా ముంబైలో ఇలాంటి అమ్మకాలు రోజుకు 20 కిలోల మేర జరుగుతుంటాయని, రెండ్రోజుల కిందట బంగారం ధర రూ.34,000 దాటినప్పుడు 50 కిలోల అమ్మకాలు జరిగాయని ముంబై బులియన్ అసోసియేషన్ పేర్కొంది. దేశవ్యాప్తంగా గతేడాది పాత బంగారం అమ్మకాలు 200 టన్నులుండగా అది ఈ ఏడాది 400 టన్నులు దాటుతుందని ముంబై బులియన్ అసోసియేషన్ అంచనా వేస్తోంది. కేవలం రెండు నెలల్లో 36 శాతం పెరగడంతో 25,000 స్థాయి వద్ద కొన్నవాళ్ళు అమ్మేస్తున్నారని, అలాగే ఇప్పటికే బంగారంలో బాగా పెట్టుబడులు పెట్టిన వాళ్ళు వాటిని తగ్గించుకుంటున్నారని బులియన్ నిపుణులు చెబుతున్నారు.
     
     ఇంకా పెరుగుతుందా
     అంతర్జాతీయంగా బంగారం ధర పతనమనేది 2011లో మొదలైందని, ఇది ఆగిపోయిందన్న సంకేతాలింకా వెలువడలేదని బులియన్ నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుత పెరుగుదలను ఒక భారీ పతనం తర్వాత వచ్చే చిన్న స్థాయి ర్యాలీగానే పరిగణించాల్సి ఉంటుందని వారంటున్నారు. అయితే దేశీయంగా బంగారం కదలికలు ఎలా ఉంటాయన్నదానిపై మాత్రం వారొక అంచనాకు రాలేకపోతున్నారు. కారణం రూపాయి క్షీణతే. దీంతో ట్రేడర్లు, స్వల్పకాలిక ఇన్వెస్టర్లు వైదొలగడానికి ఇది చక్కటి అవకాశమని చెప్పారు జెన్ మనీ జాయింట్ మేనేజింగ్ డెరైక్టర్ సతీష్ కంతేటి. అంతర్జాతీయ మార్కెట్లో 1,520 డాలర్లు దాటితేనే తిరిగి బుల్లిష్ ధోరణిలోకి వచ్చినట్లు భావించాలని, అప్పటిదాకా బంగారం అందనంతలా పెరిగిపోతుందన్న భయం అవసరం లేదని చెప్పారాయన. సిరియా యుద్ధ భయం వల్ల అంతర్జాతీయ మార్కెట్లో కూడా బంగారం ధరలు పెరుగుతున్నాయని, మరోవంక అమెరికా ఆర్థిక వ్యవస్థ నుంచి వెలువడుతున్న గణాంకాలు ఆశాజనకంగా లేకపోవడంతో డాలరు విలువ క్షీణించేలా కనిపిస్తోందని యూటీఐ గోల్డ్ ఫండ్ మేనేజర్ లలిత్ నంబియార్ చెప్పారు.
     
     దీనివల్ల అంతర్జాతీయ మార్కెట్లో ఒకవేళ బంగారం ధరలు పెరిగినా, డాలరు విలువ క్షీణించడం వల్ల ఆ మేరకు ఇండియాలో ధరలు అంతగా పెరగవని చెప్పారాయన. దేశీయ ఆర్థిక పరిస్థితితో పాటు, అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభం ఇంకా సమసిపోకపోవడంతో హెడ్జింగ్‌గా బంగారంలో పెట్టుబడులు కొనసాగించాలని, అనేక సెంట్రల్ బ్యాంకులు ఇంకా బంగారాన్ని కొంటున్నాయని ఐడీబీఐ మ్యూచువల్ ఫండ్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ బి.శరత్‌శర్మ పేర్కొన్నారు. మొత్తం మీద చూస్తే ప్రస్తుత ధరల్లో వైదొలగవచ్చని, కొత్తగా కొనేవాళ్ళు కనీసం మూడు నుంచి ఐదేళ్ళ దృష్టితో... పడినప్పుడు కొనవచ్చని సూచించారు.
     
     కేవలం హెడ్జింగ్ కోసమే..
     రూపీ పతనానికి బంగారాన్ని మించిన హెడ్జింగ్ సాధనం మరొకటి లేదు. బంగారాన్ని ఒక ఇన్వెస్ట్‌మెంట్‌లా కాకుండా మన పోర్ట్‌ఫోలియోను రక్షించుకునే ఒక హెడ్జింగ్ సాధనంగానే పరిగణించాలి. అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభం ఇంకా సమసిపోకపోవడంతో పోర్ట్‌ఫోలియోలో కనీసం 10 నుంచి 15 శాతం బంగారాన్ని కేటాయించేలా చూసుకోండి. ప్రస్తుత ధరల్లో స్వల్పకాలిక ఇన్వెస్టర్లు వైదొలగొచ్చు. కొత్తగా కొనుగోళ్ళు చేయాలనుకునే వారు అంతా ఒకేసారిగా కాకుండా బంగారంలో ఉన్న ఒడిదుడుకులను ఉపయోగించుకుంటూ సిప్ పద్ధతిలో ఇన్వెస్ట్ చేస్తే మంచిది.
     - శరత్ శర్మ, ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్, ఐడీబీఐ మ్యూచువల్ ఫండ్
     
     అక్కడ పెరిగి ఇక్కడ తగ్గుతుంది..
     దేశ, అంతర్జాతీయ పరిస్థితులను గమనిస్తే ఒక్కసారిగా బంగారం ధరలు క్షీణించే అవకాశాలు తక్కువ. సిరియా సంక్షోభం, అమెరికా ఆర్థిక గణాంకాలు ఆశించిన స్థాయిలో లేకపోవడంతో స్వల్ప కాలానికి బంగారం ధరలు పెరగవచ్చు. డాలరు విలువ రూ.65 కిందకు రాకపోవచ్చని అంచనా వేస్తున్నాం. డాలర్లు కొనే అవకాశం లేని వాళ్ళు బంగారాన్ని కొంటున్నారు. రూపీ విలువ బలపడటం వల్ల ఇండియాలో బంగారం ధరలు తగ్గే అవకాశాలున్నాయి. ఇప్పటికే బంగారంలో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు పూర్తిగా అమ్మడం కన్నా ఒకటి రెండు సంవత్సరాలు ఎదురు చూడొచ్చు. కొత్తగా కొనేవాళ్లు మాత్రం మూడేళ్లు అంతకంటే ఎక్కువ కాలపరిమితి దృష్టితో కొనాలి. పోర్ట్‌ఫోలియోకి హెడ్జింగ్‌గా బంగారాన్ని చూడాలి.
     - లలిత్ నంబియార్, మేనేజర్, యూటీఐ గోల్డ్ ఫండ్
     
     లాంగ్‌టర్మ్‌లో గోల్డే..                                               
     దీర్ఘకాలిక దృష్టితో బంగారంలో ఎప్పుడు ఇన్వెస్ట్ చేసినా ప్రయోజనమే ఉంటుంది. కాని ఒక్కసారిగా బంగారం ధరలు అత్యంత వేగంగా పెరగడంతో సంవత్సరం దృష్టితో ఇన్వెస్ట్ చేసిన వారు ఇప్పుడు వైదొలగొచ్చు. ఇప్పటికే స్వల్పకాలిక ఇన్వెస్టర్లకి మంచి లాభాలను బంగారం అందించింది.
     - జి.ఎస్.సుందర్ రాజన్, ఎండీ, శ్రీరామ్ సిటీ యూనియన్ ఫైనాన్స్ లిమిటెడ్
     
     30,000కి దిగకపోవచ్చు..
     స్వల్పకాలిక ఇన్వెస్టర్లు, ట్రేడర్లు, పోర్ట్‌ఫోలియోలో 10 శాతం కంటే ఎక్కువ బంగారాన్ని ఇన్వెస్ట్‌మెంట్‌గా కలిగిన వాళ్ళు రూ.34,000-33,000 మధ్యన విక్రయించవచ్చు. కరెక్షన్ వస్తే బంగారం రూ.32,000 -30,000 వరకు వచ్చే అవకాశముంది. ఆర్‌బీఐ గోల్డ్ బ్యాంక్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటిస్తే మాత్రం ధర మరింత క్షీణించే అవకాశముంది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు ఒక్కసారిగా పెరిగిపోతాయన్న సంకేతాలేమీ లేవు. సిరియాలో యుద్ధం వంటి సంఘటనలు జరిగితేనే ఇది సాధ్యం. ప్రస్తుత పరిస్థితుల్లో పోర్ట్‌ఫోలియోలో 5 శాతం కంటే ఎక్కువ బంగారం లేకుండా చూసుకోవడం మంచిది. కాస్త రిస్క్ చేస్తే 10 శాతం వరకు కేటాయించవచ్చు. అంతకంటే ఎక్కువ ఉంటే వైదొలగండి. ఇంత వరకు బంగారంలో పెట్టుబడి లేనివాళ్ళు మరింత పడినప్పుడు కొద్ది మొత్తంలో కొనుగోలు చేయొచ్చు.     
                - సతీష్ కంతేటి, జాయింట్ మేనేజింగ్ డెరైక్టర్
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement