
పరుగులు పెడుతున్న మార్కెట్లు
కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్జైట్లీ బడ్జెట్ ప్రభావం దేశీయ మార్కెట్లను పరుగులు పెట్టిస్తోంది. గత కొన్ని రోజులుగా తీవ్ర ఊగిసలాటల మధ్య కొట్టుమిట్టాడిన దేశీయ మార్కెట్లు భారీ లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. రికార్డుస్థాయి లాభాలతో ఇన్వెస్టర్లలో కొత్త ఆశలు చిగురింప చేస్తున్నాయి. ముంబై స్టాక్ ఎక్స్చేంజి సెన్సెక్స్ 750 పాయింట్లు ర్యాలీ అయ్యింది. సెన్సెక్స్ 23,7435 దగ్గర, నిఫ్టీ 223 పాయింట్ల లాభంతో 7210 దగ్గర కొనసాగుతున్నాయి. ముఖ్యంగా ప్రధాన మద్దతుస్థాయి దగ్గర నిలదొక్కుకున్న నిఫ్టీ 7210 దగ్గర నిలబడింది. అటు కరెన్సీ మార్కెట్, బులియన్ మార్కెట్ లోనూ లాభాలు కొనసాగుతున్నాయి.
మార్కెట్ లోని ప్రధాన సెక్టార్లన్నీ పాజిటివ్ గా ఉన్నాయి. ఐటీసీ, ఇన్ఫోసిస్, యాక్సిస్ బ్యాంక్, ఎల్ అండ్ టీ షేర్ల లాభాలు మార్కెట్ జోరుకు మరింత తోడ్పాటునందించాయి. అటు ఐటీ, ఆయిల్, గ్యాస్, మెటల్, క్యాపిటల్ గూడ్స్, బ్యాకింగ్, ఆటో రంగాలు సైతం భారీ లాభాలను ఆర్జిస్తున్నాయి. రూపాయి వరుస మూడు సెషన్లుగా లాభాల్లో ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ తో పోలిస్తే , రూపాయి 18 పైసలు లాభపడింది. పసిడి ధగధగలాడుతోంది. 10 గ్రాముల బంగారం ధర 29,621 దగ్గర ట్రేడవుతూ 30 వేలకు చేరుకుంటుందనే అనుమానాలను బలపరుస్తోంది. ఈ అరుదైన, అనూహ్య పరిణామంతో మదుపర్లు సంతోషం వ్యక్తం చేస్తుంటే.. అప్రమత్తంగా ఉండాలని ఎనలిస్టులు సూచిస్తున్నారు.