ఇక మెజారిటీ కోసమే!
సాక్షి, హైదరాబాద్: వరంగల్ ఉప ఎన్నికల్లో ఘన విజయం తమదేనని, కేవలం భారీ మెజారిటీ కోసమే ప్రచారం చేస్తున్నామంటూ అధికార టీఆర్‌ఎస్ ప్రకటనలు చేస్తోంది. విపక్షాల అభ్యర్థులను ఆత్మరక్షణలోకి నెట్టేలా ‘మైండ్ గేమ్’ మొదలుపెట్టింది. ఈ ఎన్నికలపై ముందు నుంచీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్న గులాబీ నాయకత్వం... తొలుత అభ్యర్థుల ఖరారు సమయంలో ప్రతిపక్షాలకు అభ్యర్థులే దొరకడం లేదంటూ విమర్శించింది. ఇప్పుడు గెలుపు తమదేనని, తమ అభ్యర్థికి మెజారిటీ పెంచడం కోసమే ప్రచారం చేస్తున్నామని చెబుతోంది.
‘టీఆర్‌ఎస్ మైండ్ గేమ్ అడుతోంది. ప్రత్యర్థి పార్టీలతో ఒక విధంగా మానసిక యుద్ధం చేస్తోంది. విపక్షాలు ముందే చేతులెత్తేశాయన్న అభిప్రాయాన్ని ఓటర్లలో కలిగించేలా పక్కా వ్యూహంతో వ్యవహరిస్తోంది..’’ అని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
వ్యూహం మేరకు
టీఆర్‌ఎస్ నేతలంతా మెజారిటీ కోసమే తమ పోరాటమని చెబుతున్నారు. టీఆర్‌ఎస్ నాయకత్వం ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లకు ఒక్కో మంత్రికి బాధ్యతలు అప్పజెప్పింది. అయినా ప్రస్తుతానికి వరంగల్ జిల్లా నాయకులే ఎక్కువగా ప్రచారంలో ఉన్నారు. ఎన్నికల బాధ్యతలున్న మంత్రులు జగదీశ్‌రెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డి, ఈటల రాజేందర్, కేటీఆర్ తదితరులు ఇతర కార్యక్రమాల్లో ఉండి, గురువారం కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొనలేదు. దీపావళి తర్వాతే మంత్రులు వరంగల్‌లో ప్రచారానికి వెళ్లే అవకాశం ఉందని అంటున్నారు.
మారిన రాజకీయ వాతావరణం
తొలుత కాంగ్రెస్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య ఇంట్లో ఆయన కోడలు, మనవళ్లు అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం వరంగల్ ఉప ఎన్నికల రాజకీయ వాతావరణాన్ని మార్చిందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. దీనికితోడు కాంగ్రెస్ బరిలోకి దింపిన సర్వే సత్యనారాయణ స్థానికుడు కాదు.
ఇది తమకు లాభించే అంశమన్న భరోసా టీఆర్‌ఎస్‌లో వ్యక్తమవుతోంది. వాస్తవానికి బుధవారం తమ అభ్యర్థి చేత మరోసారి నామినేషన్ వేయించేందుకు, దీనికి కోసం భారీ సంఖ్యలో కార్యకర్తలను తరలించి హడావుడి చేసేందుకు టీఆర్‌ఎస్ అన్ని ఏర్పాట్లు చేసుకుంది. కానీ సిరిసిల్ల రాజయ్య ఇంట్లో ఘటనతో భారీ సమీకరణ లేకుండానే కార్యక్రమాన్ని ముగించింది.
‘స్థానికత’పై ధీమా!
పార్టీ ఆవిర్భావం నుంచి తమతో కలసి నడిచిన సామాన్య కార్యకర్త, స్థానికుడికి టికెట్ కేటాయించామని అధికార పార్టీ చె ప్పుకుంటోంది. పేద కార్యకర్త అయినందున ఎన్నికల ఖర్చులను పార్టీయే భరిస్తోందంటూ రూ.70 లక్షల చెక్కునూ అందజేసి... ఈ అంశాలకు ప్రచారంలో ప్రాధాన్యత ఇస్తోంది. వరంగల్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు సెగ్మెంట్లలో అత్యధిక ఓట్లున్న మాదిగ వర్గానికి చెందిన స్థానిక నేతకు అవకాశమిచ్చామని పదేపదే చెబుతోంది.
దీనికితోడు కాంగ్రెస్‌లో అభ్యర్థి మారిపోయి స్థానికేతరుడైన సర్వే సత్యనారాయణ పోటీకి దిగడంతో ప్రచారానికి మరింత పదును పెడుతోంది. బీజేపీ నుంచి బరిలోకి దిగిన అభ్యర్థి ఎన్నారై దేవయ్య కూడా జిల్లా ప్రజలకు అంతగా పరిచయం లేని వ్యక్తి అంటూ కొత్త పాట అందుకుంది. ప్రతిపక్షాలకు సంబంధించి వామపక్షాల అభ్యర్థి గాలి వినోద్‌కుమార్ ఒక్కరే స్థానికుడు కావడం గమనార్హం.