బల్లకింద చేతులు పెడితే ఏడేళ్ల జైలు
న్యూఢిల్లీ: లంచావతారులకు చేదువార్త. బల్లకింద చేతులు పెడితే ఇక ఏడేళ్లు జైల్లో కూర్చోవాల్సిందే. లంచగొండులకు విధిస్తున్న ఐదేళ్ల జైలుశిక్షను ఏడేళ్లకు పెంచుతూ కేంద్ర ప్రభుత్వం బుధవారం నిర్ణయం తీసుకుంది. తదనుగుణంగా అవినీతి వ్యతిరేక చట్టంలో చేసిన సవరణలకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అంతేకాదు లంచం కేసులను క్రూరమైన నేరాల జాబితాలో చేర్చింది.
తాజా సవరణలతో 1988 నాటి అవినీతి వ్యతిరేక చట్టానికి మరింత పదును పెట్టినట్టైంది. దీనికి ప్రకారం లంచం ఇచ్చినా, తీసుకున్నా నేరంగానే పరిగణిస్తారు. ఇంతకుముందు 3 నెలల నుంచి మూడేళ్ల వరకు జైలుశిక్ష విధించేవారు. ఇప్పుడు ఈ పరిమితిని ఐదేళ్ల నుంచి ఏడేళ్ల వరకు పెంచినట్టు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది.