
కేంద్ర కేబినెట్: రేసులోకి తెలుగు వ్యక్తి
న్యూఢిల్లీ: తాజాగా చేపట్టనున్న కేంద్ర కేబినెట్ విస్తరణలో తెలుగు రాష్ట్రాల నుంచి ఒకరిద్దరికి ప్రాతినిధ్యం లభించే అవకాశం కనిపిస్తోంది. తాజాగా రేసులోకి జలవనరుల నిపుణుడు వెదిరె శ్రీరామ్ రెడ్డి వచ్చినట్టు సమాచారం. భువనగిరికి చెందిన వెదిరె శ్రీరామ్‌రెడ్డి కేంద్ర జలవనరులశాఖ సలహాదారుగా ప్రస్తుతం వ్యవహరిస్తున్నారు. పవిత్ర గంగానది పునరుజ్జీవనం కోసం పనిచేస్తున్నారు. 15 ఏళ్ల పాటు అమెరికాలోని బహుళజాతి కంపెనీ (ఎమ్మెన్సీ)లో పనిచేసిన ఆయన 2014లో బీజేపీలో చేరారు.
కేంద్ర మంత్రిపదవికి దత్తాత్రేయ రాజీనామా చేయడంతో సెంట్రల్ కేబినెట్‌లో తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం లేనట్టయింది. ఈ నేపథ్యంలో సీనియర్ నేత మురళీధర్‌రావు పేరు ప్రముఖంగా వినిపించినా.. తాజాగా రేసులోకి వెదిరె శ్రీరామ్ రెడ్డి కూడా వచ్చినట్టు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ నుంచి హరిబాబుకు కేంద్ర కేబినెట్‌లో చాన్స్ ఇవ్వడంపై సందిగ్ధత కొనసాగుతూనే ఉంది.