శ్రీసిటీలో క్యాడ్‌బరీ..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ‘క్యాడ్‌బరీ’ బ్రాండ్ నేమ్‌తో చాక్లెట్స్‌ను ఉత్పత్తి చేస్తున్న మాంటెజ్ ఆసియా పసిఫిక్‌లోనే అతిపెద్ద తయారీ కేంద్రాన్ని రాష్ట్రంలో ఏర్పాటు చేస్తోంది. చిత్తూరు జిల్లా శ్రీ సిటీ సెజ్‌లో 134 ఎకరాల్లో ఏర్పాటు చేయనున్న ఈ ప్రాజెక్టుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వంతో క్యాడ్‌బరీ ఇండియా ఒప్పందం కుదుర్చుకుంది. బుధవారం హైదరాబాద్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్.కిరణ్ కుమార్ రెడ్డి, క్యాడ్‌బరీ ఇండియా మేనేజింగ్ డెరైక్టర్ మను ఆనంద్ సంతకం చేశారు. తదనంతరం లాంఛనంగా భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మను ఆనంద్ మాట్లాడుతూ ఇది దేశంలో ఏడవ తయారీ కేంద్రమని, 2.50 లక్షల టన్నుల సామర్థ్యంగల ఈ ప్రాజెక్టును 2020కి నాలుగు దశల్లో పూర్తి చేయనున్నట్లు తెలిపారు. మొదటి దశ యూనిట్ 2015 మధ్య నాటికి అందుబాటులోకి వస్తుందని, ఇందుకోసం రూ.1,000 కోట్లు వ్యయం చేస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఇండియాలో క్యాడ్‌బరీ బ్రాండ్ పేరుమీద అయిదు రకాల ఉత్పత్తులు అందిస్తున్నామని, కాని ఈ యూనిట్ మొదటి దశలో చాక్లెట్స్‌పైనే ప్రధానంగా దృష్టిసారిస్తున్నట్లు తెలిపారు. చాక్లెట్స్‌కు ప్రధానముడిసరుకైన ‘కోకా’కోసం తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌లలో 6,000 మంది రైతులతో కాంట్రాక్టింగ్ పద్ధతిలో కోకా సాగును చేపట్టినట్లు తెలిపారు.
నాలుగున్నర లక్షలమంది రైతులకు ఉపయోగం
క్యాడ్‌బరీ చాక్లెట్ తయారీ కేంద్రానికి అవసరమైన పాలు, పంచదార సరఫరా చేయడం ద్వారా నాలుగున్నర లక్షలమంది రైతులు నేరుగా ప్రయోజనం పొందనున్నట్లు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఈ యూనిట్ పూర్తిస్థాయి సామర్థ్యం అందుబాటులోకి వస్తే రోజుకి పదిలక్షల లీటర్ల పాలు, 100 టన్నుల పంచదార అవసరమవుతుందన్నారు. ఈ యూనిట్ ద్వారా 1,600 మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభిస్తుందన్నారు. తాను ముఖ్యమంత్రిగా పదవి చేపట్టిన తర్వాత ఇప్పటి వరకు రూ.1.30 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులు రాష్ట్రానికి వచ్చినట్లు కిరణ్ కుమార్ తెలిపారు. గతేడాది రాష్ట్రం ఎదుర్కొన్న విద్యుత్ సంక్షోభం ఈ ఏడాది నుంచి ఉండదని రాష్ట్ర పారిశ్రామిక రంగానికి ముఖ్యమంత్రి అభయమిచ్చారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి జె.గీతా రెడ్డి మాట్లాడుతూ త్వరలో మెదక్ జిల్లాలో ప్రోక్టర్ అండ్ గ్యాంబుల్, జాన్సన్ అండ్ జాన్సన్ యూనిట్లను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.