టోపీలు జిందాబాద్!
న్యూఢిల్లీ: ఇఫ్తార్ విందు....ఇది ముస్లిం మతస్థులు రోజంతా అన్న పానీయాలు లేకుండా ఉపవాసం ఉండి...దాని ముగింపుగా స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలసి ఖుషీగా విందారగించే సాధారణ సంఘటన. ఇంతకుముందు కుటుంబం, స్నేహితుల వరకే పరిమితమైన ఈ విందును కుహనా సామ్యవాద పార్టీలు (సూడో సెక్యులరిస్ట్ పార్టీలు) కాస్తా ఇఫ్తార్ పార్టీగా మార్చాయి. వీటికి హంగామాను జోడించి అట్టాహాసంగా జరుపుకునే పార్టీలుగా తీర్చిదిద్దాయి.
ఓట్ల రాజకీయాల్లో భాగంగా ముస్లిం మిత్రులను పిలుస్తూ ఇఫ్తార్ పార్టీలను ఏర్పాటు చేయడం రాజకీయ పార్టీలకు ప్రహసనంగా మారిపోయాయి. ముస్లిం పెద్దలు ఏర్పాటు చేసే ఇఫ్తార్ పార్టీలకు అనుగుణంగా పర్షియన్ లేదా అరబ్ సంస్కృతులను ప్రతిబింబించేలా దుస్తులను ధరించి వెళ్లడం కూడా రాజకీయ నేతల రీతిగా మారింది.
ఈసారి ఇఫ్తార్ విందులకు హాజరైన వివిధ రాజకీయ నేత ల్లో ఎవరి గెటప్ బాగుందో తేల్చుకునేందుకు పోటీ పెట్టి ఉన్నట్టయితే బహూశ సమాజ్‌వాది అధ్యక్షుడు ములాయం సింగ్ యాదవ్‌కు దక్కేదేమో. నవతరం రాజకీయవాదిగా రంగప్రవేశంచేసి ఢిల్లీ ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టిన అరవింద్ కేజ్రీవాల్ కూడా ఇలాంటి రాజకీయాలకు అతీతుడు కాడేమో! ఇటీవల ఢిల్లీలో జరిగిన ఓ ఇఫ్తార్ పార్టీలో కేజ్రివాల్ బుద్ధిగా తెల్లటి రూమీ టోపీ ధరించగా, ఆయన పక్కనేవున్న ముస్లిం సోదరులు ఢిల్లీ లెఫ్ట్‌నెంట్ గవర్నర్ నజీబ్ జంగ్, భారత ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ మాత్రం ఎలాంటి టోపీలు ధరించకపోవడం గమనార్హం.
ఎక్కువ హిందువుల ఓట్లపై ఆధారపడే బీజేపీ మాత్రం ఇఫ్తార్ పార్టీలకు కొంత దూరంగానే ఉంటోందని చెప్పవచ్చు. విదేశీ పర్యటనలో బిజీబిజీగా గడపివచ్చిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇఫ్తార్ విందులకు దూరంగానే ఉన్నారు. ఆయన గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ముస్లింలు తమ సంప్రదాయం ప్రకారం రూమీ టోపీని పెట్టబోతే బహిరంగంగానే ఆయన వారించారు. కారణం హిందువుల ఓట్లు పోతాయన్న భయమే.
ప్రముఖ ఉర్దూ కథల రచయిత సాదత్ హసన్ మాంటో ‘బాతే’ పేరిట రాసిన కథ గురించి ఇక్కడ ప్రస్తావించాల్సిన అవసరం ఉంది. భారత స్వాతంత్య్రానికి ముందు 1942లో ముంబైలో జరిగిన హిందూ, ముస్లిం అల్లర్లను వర్ణిస్తూ ‘మనం ఏదో పని మీద బయటకు వెళ్లాలనుకున్నప్పుడు మనం రెండు టోపీలు దగ్గర పెట్టుకోవాలి.
ఒకటి హిందూ టోపీ. మరొకటి రూమీ టోపి. హిందువుల కాలనీ నుంచి వెళుతున్నప్పుడు హిందువుల టోపీ పెట్టుకుందాం. ముస్లింల కాలనీ నుంచి వెళుతుంటే రెండోది పెట్టుకుందాం. ఎందుకైనా మంచిది గాంధీ టోపీని కూడా దగ్గర పెట్టుకుందాం. అది అవసరమని అనిపించినప్పుడు దాన్నీ ధరిద్దాం. ఇంతకుముందు విశ్వాసాలు హృదయాల్లో ఉండేవి. ఇప్పుడు టోపీల్లో ఉంటున్నాయి. టోపీలు జిందాబాద్!’.