
పండుగల్లో జాగ్రత్త..!.
* దేశంలోకి చొరబడిన ఐఎస్‌ఐ ప్రేరేపిత ఉగ్రవాదులు
* టార్గెట్‌లో హైదరాబాద్ సహా పలు ప్రధాన నగరాలు
సాక్షి, హైదరాబాద్: ప్రస్తుతం నడుస్తున్న పండుగల సీజన్ నేపథ్యంలో అల్లకల్లోలం సృష్టించడానికి పాక్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలు కుట్ర పన్నినట్లు కేంద్ర హోం శాఖ (ఎంహెచ్‌ఏ) హెచ్చరించింది. దీని కోసం సుశిక్షితులైన ఐదుగురు ఉగ్రవాదుల్ని దేశంలోకి పంపినట్లు స్పష్టం చేసింది. విధ్వంసాలు సృష్టించడంతో పాటు మతకలహాలు రెచ్చగొట్టగానికీ వీరు ప్రయత్నించే ప్రమాదం ఉందని అన్ని రాష్ట్రాలకూ స్పష్టమైన హెచ్చరికలు జారీ చేసింది.
ప్రధానంగా హైదరాబాద్‌తో పాటు ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, చెన్నై, బెంగళూరు నగరాల్లో ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. పాకిస్థాన్ నిఘా సంస్థ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్(ఐఎస్‌ఐ) మద్దతుతో పేట్రేగిపోతున్న నిషిద్ధ ఉగ్రవాద సంస్థలు లష్కరేతొయిబా (ఎల్‌ఈటీ), స్టూడెంట్స్ ఇస్లామిక్ మూవ్‌మెంట్ ఆఫ్ ఇండియా(సిమి)లకు చెందిన ఐదుగురు ఉగ్రవాదులు పాక్‌లో శిక్షణ పొందినట్లు నిఘా వర్గాలు గుర్తించాయి.
ఇటీవలే వీరు దేశంలోకి ప్రవేశించారని, ఆయా నగరాల్లోని స్లీపర్ సెల్స్ సహకారంతో కుట్ర అమలు చేసేందుకు ప్రయత్నించవచ్చని ఎంహెచ్‌ఏకు నివేదించాయి. వీటిని పరిగణనలోకి తీసుకున్న కేంద్రం అన్ని రాష్ట్రాలతో పాటు ప్రధాన నగరాలకూ హెచ్చరికలు జారీ చేసింది. మార్కెట్లు, బస్టాండ్లు, రైల్వేస్టేషన్లతో పాటు జనసమ్మర్థ ప్రాంతాలపై డేగకన్ను వేసి ఉంచాలని, భద్రతా విధుల కోసం అదనపు బలగాలు మోహరించాలని సూచించింది.