కార్గో హబ్‌గా రాష్ట్రం..! | Cargo hub for the State ..! | Sakshi
Sakshi News home page

కార్గో హబ్‌గా రాష్ట్రం..!

Published Tue, Oct 22 2013 12:35 AM | Last Updated on Thu, May 3 2018 3:17 PM

కార్గో హబ్‌గా రాష్ట్రం..! - Sakshi

కార్గో హబ్‌గా రాష్ట్రం..!

జల, వాయు మార్గాల్లో సరకు రవాణాకు రాష్ట్రం కీలకమైన కేంద్రంగా మారుతోంది. ఒకవైపు పోర్టుల విస్తరణ, కొత్తగా మరో ప్రధాన నౌకాశ్రయం రానుండటం.. మరోవైపు.. ఎయిర్‌పోర్టుల్లో ఊపందుకుంటున్న మౌలిక సదుపాయాలు ఇందుకు ఊతంగా నిలుస్తున్నాయి. అసోచాం నివే దిక ప్రకారం.. దేశవ్యాప్తంగా అమలవుతున్న కొత్త పోర్టు ప్రాజెక్టుల్లో సుమారు 46 శాతం వాటాతో రాష్ట్రం ముందు వరుసలో ఉంది.  సుమారు 996 కిలోమీటర్ల సముద్ర తీరాన్ని ఉపయోగించుకుని .. సరకు రవాణా సామర్థ్యాన్ని మరింతగా పెంచుకోవడంపై  రాష్ట్రంలో పోర్టులు దృష్టి సారిస్తున్నాయి. కీలకమైన ప్రధానపోర్టు వైజాగ్ నౌకాశ్రయం సామర్ధ్య విస్తరణ దిశగా ఇప్పటికే అడుగులు వేస్తోంది. వార్షికంగా 65 మిలియన్ టన్నులుగా (ఎంటీపీఏ) ఉన్న కార్గొ హ్యాండ్లింగ్ సామర్థ్యాన్ని 2015-16 నాటికల్లా 110 ఎంటీపీఏకి పెంచుకుంటోంది. ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యం ప్రాతిపదికన చేపడుతున్న ఈ ప్రాజెక్టుపై ఏకంగా రూ. 4,500 కోట్లు వెచ్చించనున్నారు. దీంతో మరో 3-4 కొత్త బెర్తులు అందుబాటులోకి రానున్నాయి. దీనితో పాటు అటు భీమిలిలో అనుబంధ పోర్టును ఏర్పాటు చేసే సాధ్యాసాధ్యాలను కూడా వైజాగ్ పోర్టు పరిశీలిస్తోంది.
 
 8,000 కోట్లతో మరో ప్రధాన పోర్టు..
 నెల్లూరు జిల్లాలోని దుగ్గరాజుపట్నంలో దాదాపు రూ. 8,000 కోట్ల పెట్టుబడితో కొత్తగా మరో ప్రధాన పోర్టును ఏర్పాటు చేసే ప్రతిపాదన కేంద్ర క్యాబినెట్ ముందు ఉంది. దీని వార్షిక సామర్థ్యం 50 ఎంటీపీఏగా ఉండగలదు.  ముందుగా సుమారు రూ.4,000 కోట్ల వ్యయం, 4 బెర్తులతో ఏర్పాటయ్యే ఈ పోర్టులో  భారీ వాటా తీసుకోనున్నట్లు వైజాగ్ పోర్టు ఇటీవలే వెల్లడించింది. ఇందులో రాష్ట్ర ప్రభుత్వానికి 11% వాటా దక్కనున్నాయి. ఇది పూర్తయితే, రాష్ట్రంలో రెండు ప్రధాన పోర్టులు, మరో 14 చిన్న పోర్టులు అందుబాటులో ఉన్నట్లవుతుంది.
 
 విస్తరణ బాటలో మిగతా పోర్టులు..: షిప్పింగ్ శాఖ గణాంకాల ప్రకారం 2011-12లో జలమార్గం ద్వారా జరిగిన సరకు రవాణాలో 39 శాతం వాటా ప్రధానేతర పోర్టుల ద్వారానే జరిగింది. ఆంధ్రప్రదేశ్, గుజరాత్‌లోని పోర్టులు ఇందుకు తోడ్పడ్డాయి. నాలుగింట మూడొంతుల వాటాతో గుజరాత్ అగ్రస్థానంలోనూ, 13% వాటాతో ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలోనూ నిల్చాయి. 2010-11లో 43 మిలియన్ టన్నులుగా ఉన్న ప్రధానేతర పోర్టుల సరకు హ్యాండ్లింగ్ సామర్థ్యాన్ని 2020 నాటికి 175 మిలియన్ టన్నులకు పెంచుకోవాలని రాష్ట్రం నిర్దేశించుకుంది.  దీనిరనుగుణంగా ఆయా పోర్టులు జోరుగా విస్తరణ బాట పట్టా యి. ప్రస్తుతం గంగవరం, కాకినాడ, కృష్ణపట్నం తదితర పోర్టులు 14 ఉన్నాయి.  వీటిలో గంగవరం పోర్టు తన ప్రస్తుత సామర్థ్యం 15 ఎంటీపీఏని.. 45 ఎంటీపీఏకి పెంచుకోవడంపై దృష్టి సారిస్తోంది. కొత్తగా కోల్ హ్యాండ్లింగ్ టెర్మినల్‌ను, 3 బహుళ ప్రయోజన బెర్తులను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తోంది.   
 
 జోరుగా విమాన సరకు రవాణా
 హైదరాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం.. ఇటు దేశీయంగానే కాకుండా అటు దక్షిణ, ఆగ్నేయాసియా దేశాలకు అనువైన కార్గో హబ్‌గా ఎదుగుతోంది. ప్రస్తుతం ఈ ఎయిర్‌పోర్టులో ఏటా ఒక లక్ష టన్నులపైగా కార్గో హ్యాండ్లింగ్ జరుగుతుండగా.. దీన్ని క్రమక్రమంగా 1.5 లక్షల టన్నులకు పెంచుకోవచ్చు. ఈ నేపథ్యంలో పలు అంతర్జాతీయ విమానయాన సంస్థలు సైతం ఈ ఎయిర్‌పోర్టుకి ప్రాధాన్యతనిస్తున్నాయి. లుఫ్తాన్సా ఇప్పటికే దీన్ని తమ ఫార్మా హబ్‌గా ప్రకటించగా.. మరో అంతర్జాతీయ ఎయిర్‌లైన్స్ క్యాథే పసిఫిక్ ఇక్కడికి వారానికి రెండు సార్లు నడిచే బోయింగ్ 747 సరకు రవాణా సర్వీసులను నడుపుతోంది. మరోవైపు 18 విమానయాన సంస్థలు దీన్ని కార్గో బేస్‌గా మార్చుకున్నాయి. వీటికి అనుగుణంగా హైదరాబాద్ విమానాశ్రయం కూడా మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తోంది. ఉష్ణోగ్రతలు నియంత్రిత స్థాయిలో ఉండే ప్రత్యేక ఫార్మా జోన్‌ని ఏర్పాటు చేసింది. దీంతో పాటు 20 ఎకరాల మేర స్వేచ్ఛా వాణిజ్య జోన్ కూడా అందుబాటులో ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement