స్కూల్ లాకర్లలో బంగారపు కడ్డీలు
అహ్మదాబాద్: స్కూల్ లాకర్లలో బంగారపు కడ్డీలు, భారీగా డబ్బు బయట పడిన ఆశ్చర్యకర ఘటన అహ్మదాబాద్ లో వెలుగు చూసింది. చంద్రఖేదలోని ఓఎన్ జీసీ క్యాంపస్ లో ఉన్న కేంద్రీయ విద్యాలయలో వాడకంలో లేని లాకర్లలో వీటిని కనుగొన్నారు. లాకర్లలో కోటి రూపాయల నగదు, రూ. 59. లక్షల విలువచేసే బంగారం గుర్తించినట్టు పోలీసులు తెలిపారు.
చాలా కాలంగా వాడకంలోని 20 లాకర్లను గుర్తించిన ప్రిన్సిపాల్ అవదేశ్ కుమార్ వాటిని శుభ్రం చేయాలని సిబ్బందిని ఆదేశించారు. వీటిలో 5 లాకర్లకు తాళాలు లేకపోవడంతో వాటిని బద్దలు కొట్టారు. రెండు లాకర్ల నుంచి బ్యాగులు బయటపడ్డాయి. ఇందులో 100 గ్రాముల బరువున్న 21 బంగారపు కడ్డీలు బయటపడ్డాయి. దీంతో పిన్సిపాల్ పోలీసులకు సమాచారం అందించారు.
ఈ లాకర్లు ఎవరు వినియోగించారన్న సమాచారం దొరకలేదు. ఈ బ్యాగులు ఎక్కడి నుంచి వచ్చాయనే దానిపై పోలీసులు సిబ్బందిని ప్రశ్నించారు. ఆదాయపన్ను శాఖ అధికారులు పన్నుఎగవేత కోణంలో దర్యాప్తు జరుపుతున్నారు.