ఆధార్ నమోదు కేంద్రాలను ఏర్పాటుచేయాలని సీబీఎస్‌ఈ తన అనుబంధ పాఠశాలలను ఆదేశించింది.
న్యూఢిల్లీ: తమ ప్రాంగణాల్లోనే ఆధార్ నమోదు కేంద్రాలను ఏర్పాటుచేయాలని సీబీఎస్‌ఈ తన అనుబంధ పాఠశాలలను ఆదేశించింది. ఆధార్ సంఖ్య లేని విద్యార్థులు అందుకు నమోదు చేసుకునేలా ప్రోత్సహించాలని కోరింది. అయితే ఇలాంటి కేంద్రాల ఏర్పాటు స్వచ్ఛందమేనని గురువారం పాఠశాలలకు రాసిన లేఖలో స్పష్టం చేసింది. ఇందుకు అవసరమైన పరికరాలను ఆధార్ ప్రాధికార సంస్థ నిబంధనల ప్రకారమే సేకరించాలని సూచించింది.
స్కూళ్లలో ఆధార్ నమోదును ఉచితంగా చేస్తారు. బదులుగా సీబీఎస్‌ఈ ఒక్కో నమోదుకు పాఠశాలలకు రూ. 30 చెల్లిస్తుంది. ఇతర నమోదు కేంద్రాల్లో అమలయ్యే నియమ నిబంధనలనే ఇక్కడా పాటించాలి. ప్రత్యక్షంగా లేదా నమోదు ఏజెన్సీల ద్వారా ప్రజల బయోమెట్రిక్ వివరాలు సేకరించడానికి సీబీఎస్‌ఈ, ఆధార్ ప్రాధికార సంస్థ(యూఐడీఏఐ)తో ఇది వరకే ఒప్పందం కుదుర్చుకుంది.మధ్యాహ్న భోజన పథకం, ఉపకార వేతనాలకు కేంద్రం ఆధార్‌ను తప్పనిసరి చేయడంతో సీబీఎస్‌ఈ ఇలాంటి చర్యలను చేపట్టింది.