విభజన నిర్ణయం నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో నెలకొన్న పరిస్థితులపై చర్చించేందుకు ప్రధాని మన్మోహన్‌సింగ్ మంగళవారం ఉదయం కేంద్ర మంత్రివర్గ అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
ఉదయం 10.30కు సమావేశం.. రాష్ట్ర కరెంటు సంక్షోభమే ఎజెండా!
రాష్ట్రపతి పాలన విధిస్తారంటూ వార్తలు.. హుటాహుటిన ఢిల్లీకి జైపాల్
విభజన నిర్ణయం నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో నెలకొన్న పరిస్థితులపై చర్చించేందుకు ప్రధాని మన్మోహన్‌సింగ్ మంగళవారం ఉదయం కేంద్ర మంత్రివర్గ అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు. గత బుధ, గురువారాలలోనే రెండుసార్లు సమావేశమైన మంత్రివర్గాన్ని మరోసారి ఇలా అకస్మాత్తుగా ఏర్పాటు చేస్తుండటానికి కారణాలు అధికారికంగా ఇంకా వెల్లడి కాలేదు. అయితే విద్యుత్ ఉద్యోగుల నిరవధిక సమ్మె నేపథ్యంలో పరిస్థితులను సమీక్షించి, ప్రత్యామ్నాయ ఏర్పాటుపై చర్చించడమే భేటీ ఎజెండా కావొచ్చని కాంగ్రెస్ వర్గాల సమాచారం. సమ్మెతో రాష్ట్రం కరెంటు కోతలతో అల్లాడుతుండటమే గాక పలు దక్షిణాది రాష్ట్రాలకు కూడా విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగే పరిస్థితి తలెత్తడం తెలిసిందే. గ్రిడ్ కుప్పకూలవచ్చన్న వార్తలతో కేంద్రం ఆందోళన చెందుతోందని, ఈ నేపథ్యంలో సబ్‌స్టేషన్లు, సరఫరా, పంపిణీ వ్యవస్థల నిర్వహణను తాత్కాలికంగా సైనిక దళాల ఇంజనీర్లకు అప్పగించే ఆస్కారం లేకపోలేదని ఆ వర్గాలంటున్నాయి. విభజన నిర్ణయంతో అసంతృప్తిగా ఉన్న ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, విద్యుత్ సంక్షోభ పరిష్కారానికి ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టేందుకు ముందుకు రాకుంటే ఏం చేయాలన్న అంశాన్ని కూడా మంత్రివర్గం పరిశీలించవచ్చని ఏఐసీసీ వర్గాలు చెబుతున్నాయి. తప్పనిసరైతే రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించయినా దక్షిణాది గ్రిడ్ కుప్పకూలకుండా చూడవచ్చనే ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ విదేశీ పర్యటన నుంచి మంగళవారం సాయంత్రం తిరిగి రానున్నారు. ఈ నేపథ్యంలో ఉదయం 10.30కు జరుగుతున్న కేంద్ర మంత్రివర్గ సమావేశానికి ప్రాధాన్యత ఉందంటున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రానికి చెందిన సీనియర్ నాయకుడు, కేంద్ర మంత్రి ఎస్.జైపాల్‌రెడ్డి సోమవారం రాత్రే హుటాహుటిన హైద్రాబాద్ నుండి ఢిల్లీ బయల్దేరినట్టు సమాచారం. మంత్రి పదవికి రాజీనామా సమర్పించేందుకు సోమవారం సాయంత్రం తనను కలిసిన మానవ వనరుల మంత్రి ఎం.ఎం.పల్లంరాజును కూడా మంగళవారం నాటి భేటీకి తప్పకుండా హాజరవాలని ప్రధాని కోరినట్టు సమాచారం. కానీ రాజీనామా చేసినందున రాలేననిఆయన తేల్చిచెప్పారని, మరో కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావు మాత్రం హాజరవుతానని చెప్పారని తెలిసింది.