పాస్‌పోర్ట్ ఇక ఈజీ!
భువనేశ్వర్: పాస్‌పోర్ట్ కోసం ఇక వందలకొద్దీ కిలోమీటర్లు ప్రయాణించాల్సిన అవసరం లేదు. జిల్లా కేంద్రాల్లోనే పాస్‌పోర్టు సేవలు అందుబాటులోకి రానున్నాయి. వచ్చే రెండేళ్లలో దేశవ్యాప్తంగా 800 పోస్టాఫీసుల్లో పాస్‌పోర్టు సేవా కేంద్రాలను ఏర్పాటు చేస్తామని కేంద్రం ప్రకటించింది. ఈ మేరకు విదేశీ వ్యవహారాల శాఖ సహాయమంత్రి వీకేసింగ్ మంగళవారం మీడియాకు తెలిపారు.
కేంద్రంలో బీజేపీ అధికారం చేపట్టి మూడేళ్లు పూర్తయిన సందర్భంగా నిర్వహించిన సబ్‌కా సాత్ సబ్‌కా వికాస్ చర్చా కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ ఏడాది దేశవ్యాప్తంగా 150 పాస్‌పోర్టు సేవా కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని.. రానున్న రెండేళ్లలో అన్ని జిల్లా ప్రధాన పోస్టాఫీసుల్లో మరో 800 ఓపెన్ పాస్‌పోర్టు సేవా కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు.
పాస్‌పోర్టు కోసం ప్రజలు ఎక్కువ దూరం వెళ్లాల్సిన అవసరం లేకుండా చేయాలన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. విదేశీ మంత్రిత్వ శాఖ, పోస్టల్ శాఖ కలిసి ఈ సేవలు అందించనున్నాయని తెలిపారు. దళారుల ప్రమేయం లేకుండా, పారదర్శకంగా పాస్‌పోర్టు సేవలు అందుతాయని ఆయన భరోసాయిచ్చారు. దేశంలో ఇప్పటికే పలు ప్రధాన పోస్టాఫీసుల్లో పాస్‌పోర్టు సేవా కేంద్రాలను ప్రారంభించారు.