
సదావర్తి భూములపై స్పందించిన చంద్రబాబు
అమరావతి: సదావర్తి సత్రం భూములపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు. రూ.5 కోట్లు ఎక్కువ ఇస్తే ఆ భూములు ఇస్తామని గతంలోనే చెప్పామని, ఇప్పడు రూ.ఐదు కోట్ల ఆదాయం ఎక్కువ రావడం సంతోషంగా ఉందన్నారు. కాగా సదాదావర్తి భూములను వేలంపాటల్లో దక్కించుకున్న మొత్తానికి ఎవరైనా అదనంగా రూ.5 కోట్లు చెల్లిస్తే వారికే కేటాయిస్తామని రాష్ట్ర ప్రభుత్వం విసిరిన సవాల్‌కు వైఎస్‌ఆర్ సీపీ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సోమవారం ఉమ్మడి హైకోర్టు వేదికగా అంగీకారం తెలిపిన విషయం తెలిసిందే. దీన్ని పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు ఈ రూ.5 కోట్లతో కలిపి మొత్తం రూ.27.44 కోట్లు చెల్లించడానికి ఆర్కేకు నాలుగు వారాల గడువిచ్చింది. దీంతో వరుస పరిణామాలతో రాష్ట్ర ప్రభుత్వం బిత్తరపోయింది.
వేల కోట్ల రూపాయల విలువ చేసే సదావర్తి భూములను కావాల్సిన వారికి నామమాత్రపు ధరకు కట్టబెట్టిన చంద్రబాబు సర్కార్‌ను ఉమ్మడి హైకోర్టులో సోమవారం నాటి పరిణామాలు ఉక్కిరిబిక్కిరి చేశాయి. రూ.5 కోట్లు తాను చెల్లించే పరిస్థితుల్లో లేకపోయినా, ఆ మొత్తాన్ని చెల్లించేందుకు వ్యక్తిని తీసుకొస్తానని రామకృష్ణారెడ్డి కోర్టుకు తెలిపారు. రూ.5 కోట్లతో సహా మొత్తం రూ.27.44 కోట్లు చెల్లించేందుకు ఓ వ్యక్తి సిద్ధంగా ఉన్నారని హైకోర్టుకు నివేదించారు. ప్రభుత్వం ఏం జరుగుతోందో తెలుసుకునే లోపే ధర్మాసనం నాలుగు వారాల గడువు కూడా ఇవ్వడంతో ప్రభుత్వం దిమ్మతిరిగింది.
దీంతో ప్రభుత్వం ఇప్పుడు ఆ మాట నుంచి వెనక్కి వెళ్లలేదు. చెప్పినట్లు ఆ వ్యక్తి రూ.27.44 కోట్లు కడితే 83 ఎకరాలు అతనికి అప్పజెప్పాలి. ఇదే జరిగితే సొంత మనుషుల చేతిలో నుంచి వేల కోట్ల విలువైన భూములు జారిపోవడం ప్రభుత్వానికి కళ్ల ముందు కనిపిస్తోంది. దీంతో ప్రభుత్వ పరిస్థితి ముందు నుయ్యి.. వెనుక గొయ్యి అన్నట్లుగా తయారైంది.