sadavarthi satram lands
-
సదావర్తి భూములపై విజిలెన్స్ విచారణకు అదేశం
-
‘సదావర్తి’లో అక్రమాలపై విజి‘లెన్స్’
సాక్షి, అమరావతి: గత తెలుగుదేశం ప్రభుత్వంలో అప్పటి అధికార పార్టీ నేతలకు సదావర్తి సత్రం భూములను కారుచౌకగా కట్టబెట్టేందుకు జరిగిన ప్రయత్నాలపై వైఎస్ జగన్ ప్రభుత్వం విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్సుమెంట్ విచారణకు ఆదేశించింది. ఈ మేరకు మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. సత్రం పేరిట చెన్నై సమీపంలో ఉన్న 83.11 ఎకరాలను అతి తక్కువ ధరకు కొందరు టీడీపీ నేతలకు కట్టబెట్టేందుకు చేసిన ప్రయత్నాలను ‘సాక్షి’ వెలుగులోకి తీసుకురావడం, వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి న్యాయ పోరాటం చేయడంతో భూముల అమ్మకం ప్రక్రియ నిలిచిపోయింది. అప్పట్లో జరిగిన వేలం ప్రక్రియలో అవకతవకలపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్సుమెంట్ ద్వారా విచారణ జరిపిస్తామని ప్రస్తుత ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాల్లో హామీ ఇచ్చింది. ఈ మేరకు విచారణకు ఆదేశిస్తూ దేవదాయ శాఖ ముఖ్య కార్యదర్శి మన్మోహన్సింగ్ జీవో జారీ చేశారు. భూముల అమ్మకానికి అప్పట్లో ప్రభుత్వ పరంగా, దేవదాయ శాఖ తీసుకున్న నిర్ణయాలకు సంబంధించిన పూర్తి వివరాలను విజిలెన్స్ అధికారులకు అప్పగించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. -
సదావర్తి భూములపై ఏపీ సర్కార్‌కు ఎదురుదెబ్బ
-
సదావర్తి భూములపై ఏపీ సర్కార్‌కు ఎదురుదెబ్బ
ఢిల్లీ : సదావర్తి సత్రం భూములపై చంద్రబాబు నాయుడు సర్కార్‌కు సుప్రీంకోర్టులోఎదురుదెబ్బ తగిలింది. ప్రభుత్వ తీరును న్యాయస్థానం పరోక్షంగా తప్పుబట్టింది. వేలం ఆపాలన్న పిటిషన్‌ను మంగళవారం తిరస్కరించింది. హైకోర్టు ఆదేశాల ప్రకారం ఈ భూములను మరోసారి వేలం వేయాలని సుప్రీంకోర్టు కీలక తీర్పిచ్చింది. సదావర్తి భూముల వేలం ఆపాలన్న పిటిషనర్ మాదాల సంజీవరెడ్డి అభ్యర్థనపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. మోసం జరుగుతుంటే కళ్లు మూసుకోలేమని ఉన్నత ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. అలాగే వేలంలో ప్రతివాదులు కూడా పాల్గొనాలని సూచిస్తూ, కేసు తదుపరి విచారణను ఈ నెల 18కి వాయిదా వేసింది. కాగా, తమిళనాడులోని చంగల్పట్టు వద్ద సర్వే నంబర్ 59/1లో అమరావతి ప్రాంతంలో ఎన్నో దశాబ్దాలుగా సేవలందిస్తున్న సదావర్తి సత్రానికి చెందిన భూములున్న సంగతి తెలిసిందే. కాగా సదావర్తి సత్రానికి చెందిన 83 ఎకరాల అత్యంత విలువైన భూముల్లో 79 ఎకరాలకే వేలం నిర్వహిస్తున్న ఏపీ సర్కార్ తీరును వైఎస్ఆర్ సీపీ మంగళ గిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. మిగతా 4 ఎకరాలకు ఎందుకు మినహాయింపు ఇచ్చారో సర్కార్‌ను సంజాయిషీ కోరాలని ఆయన తరఫు న్యాయవాది పొన్నవోలు సుధాకర్‌రెడ్డి నిన్న (సోమవారం) ఉమ్మడి హైకోర్టు ను అభ్యర్థించారు. దీనిపై అఫిడవిట్ దాఖలు చేయాలని, ఆ తర్వాత తాము ఏపీ సర్కార్ వివరణ కోరుతామని ఉమ్మడి హైకోర్టు తాత్కాలిక సీజే జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ జె.ఉమాదేవిలతో కూడిన ధర్మాసనం ప్రకటించింది. ఈ లోగా వేలం ప్రక్రియను కొనసాగనివ్వాలని సూచించిన విషయం తెలిసిందే. -
సదావర్తి భూములపై స్పందించిన చంద్రబాబు
అమరావతి: సదావర్తి సత్రం భూములపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు. రూ.5 కోట్లు ఎక్కువ ఇస్తే ఆ భూములు ఇస్తామని గతంలోనే చెప్పామని, ఇప్పడు రూ.ఐదు కోట్ల ఆదాయం ఎక్కువ రావడం సంతోషంగా ఉందన్నారు. కాగా సదాదావర్తి భూములను వేలంపాటల్లో దక్కించుకున్న మొత్తానికి ఎవరైనా అదనంగా రూ.5 కోట్లు చెల్లిస్తే వారికే కేటాయిస్తామని రాష్ట్ర ప్రభుత్వం విసిరిన సవాల్‌కు వైఎస్ఆర్ సీపీ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సోమవారం ఉమ్మడి హైకోర్టు వేదికగా అంగీకారం తెలిపిన విషయం తెలిసిందే. దీన్ని పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు ఈ రూ.5 కోట్లతో కలిపి మొత్తం రూ.27.44 కోట్లు చెల్లించడానికి ఆర్కేకు నాలుగు వారాల గడువిచ్చింది. దీంతో వరుస పరిణామాలతో రాష్ట్ర ప్రభుత్వం బిత్తరపోయింది. వేల కోట్ల రూపాయల విలువ చేసే సదావర్తి భూములను కావాల్సిన వారికి నామమాత్రపు ధరకు కట్టబెట్టిన చంద్రబాబు సర్కార్‌ను ఉమ్మడి హైకోర్టులో సోమవారం నాటి పరిణామాలు ఉక్కిరిబిక్కిరి చేశాయి. రూ.5 కోట్లు తాను చెల్లించే పరిస్థితుల్లో లేకపోయినా, ఆ మొత్తాన్ని చెల్లించేందుకు వ్యక్తిని తీసుకొస్తానని రామకృష్ణారెడ్డి కోర్టుకు తెలిపారు. రూ.5 కోట్లతో సహా మొత్తం రూ.27.44 కోట్లు చెల్లించేందుకు ఓ వ్యక్తి సిద్ధంగా ఉన్నారని హైకోర్టుకు నివేదించారు. ప్రభుత్వం ఏం జరుగుతోందో తెలుసుకునే లోపే ధర్మాసనం నాలుగు వారాల గడువు కూడా ఇవ్వడంతో ప్రభుత్వం దిమ్మతిరిగింది. దీంతో ప్రభుత్వం ఇప్పుడు ఆ మాట నుంచి వెనక్కి వెళ్లలేదు. చెప్పినట్లు ఆ వ్యక్తి రూ.27.44 కోట్లు కడితే 83 ఎకరాలు అతనికి అప్పజెప్పాలి. ఇదే జరిగితే సొంత మనుషుల చేతిలో నుంచి వేల కోట్ల విలువైన భూములు జారిపోవడం ప్రభుత్వానికి కళ్ల ముందు కనిపిస్తోంది. దీంతో ప్రభుత్వ పరిస్థితి ముందు నుయ్యి.. వెనుక గొయ్యి అన్నట్లుగా తయారైంది. -
హైకోర్టు తీర్పును స్వాగతించిన ఎమ్మెల్యే ఆర్కే
హైదరాబాద్ : సదావర్తి భూములకు సంబంధించి హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అన్నారు. న్యాయస్థానం కీలక తీర్పు అనంతరం ఆయన సోమవారం మీడియాతో మాట్లాడారు. కోర్టు తీర్పును గౌరవించి రూ.5 కోట్లను అదనంగా చెల్లిస్తామన్నారు. ప్రభుత్వ ఆస్తులను చంద్రబాబు నాయుడు కొల్లగొడితే చూస్తూ ఊరుకోమని ఎమ్మెల్యే ఆర్కే హెచ్చరించారు. అన్యాక్రాంతం అయిన దేవాదాయ శాఖకు చెందిన మిగతా భూములపై కూడా తాము పోరాడతామన్నారు. చెన్నైకి సమీపంలో ఉన్న 100కోట్ల విలువ చేసే సదావర్తి భూములను చంద్రబాబు తన బినామీలకు 22 కోట్లకే కట్టబెట్టారని అన్నారు. ఈ విషయంలో తాము చేసిన న్యాయపోరాటం ఫలించిందని అన్నారు. కోర్టు తీర్పు ప్రకారం... అదనంగా 5కోట్ల రూపాయాలు చెల్లించి భూములను దక్కించుకుంటామన్నారు. కోర్టు తీర్పు ప్రభుత్వానికి చెంపపెట్టు అని ఎమ్మెల్యే ఆర్కే ఎద్దేవా చేశారు. ఆంధ్రప్రదేశ్ సర్కార్‌కు హైకోర్టులో చుక్కెదురు -
ఆంధ్రప్రదేశ్ సర్కార్‌కు హైకోర్టులో చుక్కెదురు
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఉమ్మడి హైకోర్టులో చుక్కెదురు అయిందిన. సదావర్తి సత్రం భూములపై న్యాయస్థానం సోమవారం కీలక తీర్పునిచ్చింది. ఏపీ సర్కార్ సదావర్తి సత్రానికి చెందిన 84 ఎకరాల భూమిని కొంతమంది పెద్దలకు రూ.22కోట్లకే కట్టబెట్టిన విషయం తెలిసిందే. అయితే ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు ఇవాళ తుది తీర్పునిచ్చింది. రూ.22 కోట్ల కంటే ఎక్కువగా మరో రూ.5కోట్లు చెల్లిస్తే ఆ భూములను మీకే కేటాయిస్తామని ఎమ్మెల్యే ఆర్కేకు తెలిపింది. ఈ లెక్కన రెండు వారాల్లో 10 కోట్లు, నాలుగు వారాల్లోపు 17.44 కోట్ల రూపాయలు చెల్లించాలని హైకోర్టు పేర్కొంది. అదనంగా ఆ రూ.5 కోట్లు ఎక్కువగా చెల్లించేందుకు సిద్ధమేనని ఆయన ఈ సందర్భంగా కోర్టుకు తెలిపారు. మరోవైపు హైకోర్టు తీర్పును ఎమ్మెల్యే ఆర్కే స్వాగతించారు. న్యాయస్థానం తీర్పును శిరసా వహిస్తామని ఆయన తెలిపారు. కాగా అత్యంత విలువైన సదావర్తి సత్రం భూములను ప్రభుత్వ పెద్దలు కారుచౌకగా కొట్టేసిన విషయం తెలిసిందే. తమిళనాడు రాజధాని చెన్నై సమీపంలో రూ.1,000 కోట్ల విలువైన 83.11 ఎకరాల సత్రం భూములను వేలంలో రూ.22.44 కోట్లకే బినామీల ముసుగులో వారు దక్కించుకున్నట్లు ‘సాక్షి’ ఆధారాలతో సహా వెలుగులోకి తీసుకొచ్చింది. ఈ వేలం నిబంధనల మేరకే జరిగిందని, అక్రమాలకు ఆస్కారమే లేదం టూ సర్కారు పెద్దలు అడ్డంగా బుకాయిస్తున్నా... వారి దోపిడీని బయటపెట్టే సాక్ష్యం ‘సాక్షి’ బట్టబయలు చేసిన విషయం విదితమే. దీనిపై సదావర్తి సత్రం భూముల వేలంలో నిబంధనలకు పాతరేశారని, అడ్డగోలుగా వ్యవహరించారని ఆక్షేపిస్తూ దేవాదాయ, ధర్మాదాయ శాఖ ప్రాంతీయ సంయుక్త కమిషనర్(ఆర్జేసీ) ఆ శాఖ కమిషనర్‌కు సవివరమైన నివేదిక అందజేశారు. తమ బండారం బయటపడుతుందనే భయంతో ప్రభుత్వ పెద్దలు ఈ లేఖను తొక్కిపెట్టేశారు. -
'సదావర్తి'లో లోకేశ్ చక్రం తిప్పారు..
అనంతపురం : సదావర్తి సత్రం భూముల విషయంలో కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కనుసన్నల్లో ఆయన కుమారుడు లోకేశ్ చక్రం తిప్పారని, పట్టపగలే దోపిడీకి సిద్ధపడ్డారని విమర్శించారు. గురువారం ఆయన అనంతపురంలోని సీపీఐ జిల్లా కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఎకరా భూమి రూ. 7.28 కోట్లు ఉండగా 83.11 ఎకరాలను కేవలం 22.44 కోట్లకు అప్పగించడం వెనుక ముఖ్యమంత్రి ఆదేశాలు ఉన్నాయనేది సుస్పష్టమన్నారు. వేలం నిర్వహణలో నిబంధనలు పాటించలేదని దేవాదాయ శాఖ ప్రాంతీయ సంయుక్త కమిషనర్ నిర్ధారించారని గుర్తు చేశారు. చెన్నైలోని సదావర్తి భూముల కుంభకోణం వెనుక చంద్రబాబు, లోకేశ్ హస్తం ఉందన్న రామకృష్ణ... ఏపీ ప్రభుత్వంలో చేతకాని దద్ధమ్మలే ఎక్కువమంది ఉన్నారంటూ మండిపడ్డారు. చంద్రబాబుకు నిజాయితీ ఉంటే తక్షణం వేలం రద్దు చేసి, సమగ్ర న్యాయ విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు. ఇక ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో కేంద్రం దొంగాట ఆడుతోందన్నారు. పుష్కరాల తర్వాత శుభవార్త వింటారని, వెంకయ్యకు ఆరోగ్యం బాగోలేక కలవలేకపోయాయని, తరువాత ఆయనతో మాట్లాడతానని కేంద్ర మంత్రి అరుణ్‌జైట్లీ చెప్పడం పచ్చి ఆబద్ధమన్నారు. తీవ్రమైన జ్వరం కారణంగా వెంకయ్య నాయుడుతో చర్చించలేదని కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ చెప్పటం విడ్డూరంగా ఉందన్నారు. ఆయన చెప్పిన రోజునే వెంకయ్య ఎమ్మార్పీఎస్ ధర్నాలో పాల్గొన్నారన్నారు. ప్రత్యేక హోదా ప్రకటించేందుకు, పుష్కరాలకు సంబంధం ఏమిటని ప్రశ్నించారు. ప్రత్యేక హదా ఇచ్చేవరకు పోరాటం ఆగదన్నారు. ఒకవైపు అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు బ్యారల్ ధరలు భారీగా తగ్గినా.. పెట్రో ధరలు మాత్రం పెరుగుతూనే ఉన్నాయన్నారు. ఎఫ్‌డీఐలను కేంద్రం ప్రోత్సహిస్తోందన్నారు. దీనికి నిరనసగా ఈ నెల 17న రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో సీపీఐ ఆధ్వర్యంలో ధర్నాలు నిర్వహిస్తామన్నారు. -
ఎక్కువ డబ్బిస్తే వారికే సత్రం భూములు
- రూ.22 కోట్ల కంటే ఎక్కువ చెల్లిస్తామంటే సత్రం భూములు అప్పగిస్తాం - ఈ డబ్బుతో ప్రభుత్వానికి సంబంధంలేదు.. అక్రమాలు జరగలేదు - చెన్నైలోని సదావర్తి సత్రం భూముల విక్రయంపై దేవాదాయ మంత్రి మాణిక్యాల రావు వివరణ విజయవాడ: ఏపీ దేవాదాయ శాఖకు చెందిన సదావర్తి సత్రం భూముల విక్రయంలో ఎలాంటి అవకతవకలు చోటుచేసుకోలేదని ఆ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాల రావు చెప్పారు. చెన్నై నగర శివారులోని సత్రం భూములను పత్రికల్లో ప్రకటనలు ఇచ్చిమరీ బహిరంగ వేలం ద్వారానే విక్రయించామని, వేలం ద్వారా లభించిన రూ.22 కోట్లను సత్రం ధర్మకర్తలకే ఇచ్చేస్తామని, ఆ డబ్బుతో ప్రభుత్వాని ఎలాంటి సంబంధం లేదని తెలిపారు. మంగళవారం విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆయన సదావర్తి సత్రం భూముల విక్రయంపై వివరణ ఇచ్చారు. (చదవండి: సదావర్తి సత్రం భూముల్లో వేలకోట్ల స్కాం జరిగింది) 1885లో వాసిరెడ్డి వెంకట లక్ష్మమ్మ సదావర్తి సత్రానికి భూములు అప్పగించారని, అప్పటికే చాలా వరకు ఆక్రమణలో ఉన్న ఆ భూమిపై కోర్టులో వివాదం నడిచిందని, 1924లో కోర్టు డిక్రీ ద్వారా భూములన్నీ సత్రానికి చెందాయని మంత్రి మాణిక్యాల రావు తెలిపారు. 1962లో సదావర్తి సత్రం ఏపీ దేవాదాయ ధర్మాదాయ శాఖ పరిధిలోకి వచ్చిందని, అయినప్పటికీ సత్రం ధర్మకర్తలే భూములను పర్యవేక్షిస్తూ వచ్చారని చెప్పారు. '2006లో టీడీపీ ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర సత్రం భూములపై అసెంబ్లీలో ప్రస్తావించారు. తర్వాత టీడీపీ నేత కొమ్మలపాటి శ్రీధర్.. సత్రం భూములపై ముఖ్యమంత్రికి వినతిపత్రం సమర్పించారు. గతేడాది డిసెంబర్ 29న సత్రం భూములను వేలం వేయాలని దేవాదాయ శాఖ నిర్ణయించింది. బహిరంగ వేలం ద్వారా 83.11 ఎకరాల భూమిని విక్రయించగా రూ. 22 కోట్లు పలికింది' అని మంత్రి వివరించారు. (చదవండి: సత్రం భూములపై అంత ఆత్రమా?) అయితే బహిరంగ మార్కెట్ లో సుమారు రూ.981 కోట్లు విలువచేసే సత్రం భూములను టీడీపీకి చెందిన నేతలు తక్కువ ధరకే కొట్టేశారని ప్రతిపక్ష వైఎస్సార్ సీసీ ఆరోపించింది. భూముల వ్యవహారంపై సీనియర్ నేత ధర్మాన ప్రసాదరావు నేతృత్వంలో ఏర్పాటైన కమిటీ కూడా విక్రయాల్లో అక్రమాలు చోటుచేసుకున్నాయని తేల్చిచెప్పింది. (ధర్మాన కమిటీ మధ్యంతర నివేదిక కోసం ఇక్కడ క్లిక్ చేయండి) కాగా, సదావర్తి భూముల విలువ రూ.900 కోట్లు ఉంటుందనటం సరికాదని మంత్రి మాణిక్యాల అన్నారు. బ్యాకు గ్యారంటీ ద్వారా ఎవరైనా ముందుకు వచ్చి రూ.22 కోట్ల కన్నా అధికంగా చెల్లిస్తామంటే మళ్లీ బహిరంగ వేలం నిర్వహించి వారికే భూములు అప్పగిస్తామని స్పష్టం చేశారు. భూముల వ్యవహారంలో మొదటినుంచీ పారదర్శకంగానే వ్యవహరిస్తున్నామని చెప్పుకొచ్చారు. (చదవండి: 'సత్రం' ఫైల్.. సూపర్ ఫాస్ట్) -
'ముఖ్యమంత్రి మౌనం ఎందుకు?'
చెన్నై: సదావర్తి సత్రం భూములను టీడీపీ నేతలు అక్రమంగా కొట్టేశారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత ధర్మాన ప్రసాదరావు అన్నారు. ఇంత జరిగినా ముఖ్యమంత్రి ఎందుకు మౌనంగా ఉన్నారని ఆయన ప్రశ్నించారు. సత్రం భూముల అమ్మకాల్లో లోకేశ్ కు ప్రమేయం ఉందా అని ప్రశ్నించారు. దేవాదాయ శాఖ మంత్రి కూడా ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు. సత్రం భూముల వేలాన్ని రద్దు చేస్తే వచ్చే ఇబ్బంది ఏమిటని అన్నారు. ఈ వేలాన్ని రద్దు చేయాలని ఇప్పటికే అందరూ డిమాండ్ చేస్తున్నారని గుర్తుచేశారు. వెయ్యి కోట్లకు పైగా దోపిడికి జరిగిన విషయం స్పష్టంగా తెలుస్తోందని అన్నారు. సదావర్తి సత్రం పరిధిలో ప్రభుత్వ ధర ఎకరాకు రూ.6.5కోట్లు ఉంటే మీరు ఎకరాకు రూ.27లక్షలకే ఎలా కట్టబెడతారని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి, సంబంధిత మంత్రి వెంటనే స్పందించి సత్రం భూముల వేలాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సత్రం భూములపై జాతీయ స్థాయిలో పోరాటాన్ని కొనసాగిస్తామని ధర్మాన చెప్పారు. సదావర్తి సత్రం భూములపై నిజనిర్ధారణ కమిటీ నివేదికను పార్టీ అధినేత వైఎస్ జగన్ కు అందజేసి భవిష్యత్ కార్యాచరణను నిర్ణయిస్తామని ధర్మాన చెప్పారు.