సదావర్తి భూములపై ఏపీ సర్కార్‌కు ఎదురుదెబ్బ
ఢిల్లీ : సదావర్తి సత్రం భూములపై చంద్రబాబు నాయుడు సర్కార్‌కు సుప్రీంకోర్టులోఎదురుదెబ్బ తగిలింది. ప్రభుత్వ తీరును న్యాయస్థానం పరోక్షంగా తప్పుబట్టింది. వేలం ఆపాలన్న పిటిషన్‌ను మంగళవారం తిరస్కరించింది. హైకోర్టు ఆదేశాల ప్రకారం ఈ భూములను మరోసారి వేలం వేయాలని సుప్రీంకోర్టు కీలక తీర్పిచ్చింది. సదావర్తి భూముల వేలం ఆపాలన్న పిటిషనర్ మాదాల సంజీవరెడ్డి అభ్యర్థనపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.
మోసం జరుగుతుంటే కళ్లు మూసుకోలేమని ఉన్నత ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. అలాగే వేలంలో ప్రతివాదులు కూడా పాల్గొనాలని సూచిస్తూ, కేసు తదుపరి విచారణను ఈ నెల 18కి వాయిదా వేసింది. కాగా, తమిళనాడులోని చంగల్పట్టు వద్ద సర్వే నంబర్ 59/1లో అమరావతి ప్రాంతంలో ఎన్నో దశాబ్దాలుగా సేవలందిస్తున్న సదావర్తి సత్రానికి చెందిన భూములున్న సంగతి తెలిసిందే.
కాగా సదావర్తి సత్రానికి చెందిన 83 ఎకరాల అత్యంత విలువైన భూముల్లో 79 ఎకరాలకే వేలం నిర్వహిస్తున్న ఏపీ సర్కార్ తీరును వైఎస్‌ఆర్ సీపీ మంగళ గిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. మిగతా 4 ఎకరాలకు ఎందుకు మినహాయింపు ఇచ్చారో సర్కార్‌ను సంజాయిషీ కోరాలని ఆయన తరఫు న్యాయవాది పొన్నవోలు సుధాకర్‌రెడ్డి నిన్న (సోమవారం) ఉమ్మడి హైకోర్టు ను అభ్యర్థించారు.
దీనిపై అఫిడవిట్ దాఖలు చేయాలని, ఆ తర్వాత తాము ఏపీ సర్కార్ వివరణ కోరుతామని ఉమ్మడి హైకోర్టు తాత్కాలిక సీజే జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ జె.ఉమాదేవిలతో కూడిన ధర్మాసనం ప్రకటించింది. ఈ లోగా వేలం ప్రక్రియను కొనసాగనివ్వాలని సూచించిన విషయం తెలిసిందే.