గుంటూరు జిల్లా ఆత్మకూరులో తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయం
సాక్షి, న్యూఢిల్లీ: టీడీపీ రాష్ట్ర కార్యాలయ నిర్మాణం కోసం గుంటూరు జిల్లా ఆత్మకూరులో గత సర్కారు చేసిన భూ కేటాయింపులకు సంబంధించి సుప్రీంకోర్టు తెలుగుదేశం పార్టీకి నోటీసులు జారీచేసింది. సీఆర్‌డీఏ, రాష్ట్ర ప్రభుత్వంతోపాటు మొత్తం 12 మంది ప్రతివాదులకు నోటీసులు జారీ చేస్తూ మూడు వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను నవంబరు 23వతేదీకి వాయిదా వేస్తూ సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.
ఎమ్మెల్యే ఆర్కే పిటిషన్‌పై వీడియో కాన్ఫరెన్స్‌లో విచారణ..
వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ రోహింటన్ నారీమన్, జస్టిస్ నవీన్ సిన్హా, జస్టిస్ కృష్ణ మురారిలతో కూడిన« ధర్మాసనం మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ చేపట్టింది. ఎమ్మెల్యే ఆళ్ల తరఫున న్యాయవాదులు ప్రశాంత్ భూషణ్, రమేష్ అల్లంకి వాదనలు వినిపించారు. గత సర్కారు టీడీపీ రాష్ట్ర కార్యాలయ నిర్మాణం కోసం అక్రమంగా భూ కేటాయింపులు చేసిందని, నిబంధనలు ఉల్లంఘిస్తూ జరిపిన కేటాయింపులపై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.
పర్యావరణం కోణంలో చూడాలి..
‘మంగళగిరి మండలం ఆత్మకూరులో సర్వే నంబర్లు 392/1, 392/3, 392/4, 392/8, 392/10 పరిధిలో టీడీపీ రాష్ట్ర కార్యాలయ నిర్మాణానికి గత సర్కారు 99 సంవత్సరాల లీజు ప్రాతిపదికన భూమి కేటాయించింది. అవి పోరంబోకు భూములు. వాటిని ఎవరికీ కేటాయించడానికి వీల్లేదు. కానీ నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలకు అనుమతించారు. ఇది చట్ట, రాజ్యాంగ విరుద్ధం. నీటి వనరులు, వాటితో సంబంధం ఉన్న భూములను కేటాయించడంపై నిషేధం ఉన్నా నిబంధనలు ఉల్లంఘించి కేటాయింపులు చేశారు.
ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం–1994 నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారు. చట్ట ప్రకారం తగిన చర్యలు తీసుకోవడానికి స్వేచ్ఛ ఉందని హైకోర్టు చెప్పినప్పటికీ కూల్చివేతకు ఆదేశాలు ఇవ్వలేదు. లీజు, నిర్మాణాలు నిషేధమని నాటి ప్రభుత్వం అంగీకరించినా స్పష్టమైన ఆదేశాలు జారీ చేయలేదు’ అని తెలిపారు. ఈ తరహా కేసులు పెండింగ్‌లో ఉన్నాయి కాబట్టే హైకోర్టు కేసును ముగించి ఉండవచ్చు కదా? అని ఈ సందర్భంగా ధర్మాసనం అభిప్రాయం వ్యక్తం చేసింది. అయితే పెండింగ్‌లో ఉన్న కేసు వ్యక్తిగతమైందని, ఈ కేసును మాత్రం పర్యావరణానికి సంబంధించిన పెద్ద అంశంగా చూడాలని ప్రశాంత్ భూషణ్ ధర్మాసనానికి నివేదించారు. కేవియెట్‌లు ఏమైనా ఉన్నాయా? అని ప్రశ్నించిన ధర్మాసనం మూడు వారాల్లో కౌంటర్లు దాఖలు చేయాలని ప్రతివాదులకు నోటీసులు జారీ చేస్తూ విచారణను వాయిదా వేసింది.
Comments
Please login to add a commentAdd a comment