
ఆంధ్రప్రదేశ్ సర్కార్‌కు హైకోర్టులో చుక్కెదురు
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఉమ్మడి హైకోర్టులో చుక్కెదురు అయిందిన. సదావర్తి సత్రం భూములపై న్యాయస్థానం సోమవారం కీలక తీర్పునిచ్చింది. ఏపీ సర్కార్ సదావర్తి సత్రానికి చెందిన 84 ఎకరాల భూమిని కొంతమంది పెద్దలకు రూ.22కోట్లకే కట్టబెట్టిన విషయం తెలిసిందే. అయితే ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు ఇవాళ తుది తీర్పునిచ్చింది.
రూ.22 కోట్ల కంటే ఎక్కువగా మరో రూ.5కోట్లు చెల్లిస్తే ఆ భూములను మీకే కేటాయిస్తామని ఎమ్మెల్యే ఆర్కేకు తెలిపింది. ఈ లెక్కన రెండు వారాల్లో 10 కోట్లు, నాలుగు వారాల్లోపు 17.44 కోట్ల రూపాయలు చెల్లించాలని హైకోర్టు పేర్కొంది. అదనంగా ఆ రూ.5 కోట్లు ఎక్కువగా చెల్లించేందుకు సిద్ధమేనని ఆయన ఈ సందర్భంగా కోర్టుకు తెలిపారు. మరోవైపు హైకోర్టు తీర్పును ఎమ్మెల్యే ఆర్కే స్వాగతించారు. న్యాయస్థానం తీర్పును శిరసా వహిస్తామని ఆయన తెలిపారు.
కాగా అత్యంత విలువైన సదావర్తి సత్రం భూములను ప్రభుత్వ పెద్దలు కారుచౌకగా కొట్టేసిన విషయం తెలిసిందే. తమిళనాడు రాజధాని చెన్నై సమీపంలో రూ.1,000 కోట్ల విలువైన 83.11 ఎకరాల సత్రం భూములను వేలంలో రూ.22.44 కోట్లకే బినామీల ముసుగులో వారు దక్కించుకున్నట్లు ‘సాక్షి’ ఆధారాలతో సహా వెలుగులోకి తీసుకొచ్చింది. ఈ వేలం నిబంధనల మేరకే జరిగిందని, అక్రమాలకు ఆస్కారమే లేదం టూ సర్కారు పెద్దలు అడ్డంగా బుకాయిస్తున్నా... వారి దోపిడీని బయటపెట్టే సాక్ష్యం ‘సాక్షి’ బట్టబయలు చేసిన విషయం విదితమే.
దీనిపై సదావర్తి సత్రం భూముల వేలంలో నిబంధనలకు పాతరేశారని, అడ్డగోలుగా వ్యవహరించారని ఆక్షేపిస్తూ దేవాదాయ, ధర్మాదాయ శాఖ ప్రాంతీయ సంయుక్త కమిషనర్(ఆర్‌జేసీ) ఆ శాఖ కమిషనర్‌కు సవివరమైన నివేదిక అందజేశారు. తమ బండారం బయటపడుతుందనే భయంతో ప్రభుత్వ పెద్దలు ఈ లేఖను తొక్కిపెట్టేశారు.