
ఇటు చంద్రబాబు అటు సుష్మా స్వరాజ్...
న్యూఢిల్లీ: ‘ఓటుకు కోట్లు’ కుంభకోణం ఇటు రెండు తెలుగు రాష్ట్రాల్లో రోజు రోజుకు ఉత్కంఠను రేపుతుండగా, అటు కేంద్రంలో లలిత్ మోదీ వీసా స్కామ్‌కు సంబంధించి రోజు రోజుకు వెలుగులోకి వస్తున్న కొత్త అంశాలు ఉత్కంఠను రేపుతున్నాయి. ఓటుకు నోట్లు కుంభకోణంలో ఇరుక్కున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని ఎప్పుడు అరెస్టు చేస్తారు? అసలు చేస్తారా లేదా? అంశంపై ఇరు రాష్ట్రాల్లోని వైరి వర్గాల్లో చర్చోపచర్చలు జరుగుతుండగా, తనకు ఇమిగ్రేషన్ వీసా కేసులో విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్, రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధర రాజే సహాయం చేశారని లలిత్ మోదీయే స్వయంగా వెల్లడించిన నేపథ్యంలో వారిద్దరిపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చర్య తీసుకుంటుందా, లేదా ? అన్న అంశంపై అన్ని రాజకీయ పక్షాల్లో చర్చ జరుగుతోంది.
మానవతా హృదయంతో తాను లతిత్ మోదీకి సహాయం చేశానే తప్ప మరో ఉద్దేశంతో కాదని తనను తాను సమర్థించుకున్న సుష్మా స్వరాజ్‌ను బయటకు సమర్థిస్తూ వస్తోన్న కేంద్రం, వసుంధర రాజే గురించి మాత్రం ఏమీ మాట్లాడడం లేదు. ముందుగా సుష్మ రాజీనామాకు డిమాండ్ చేసిన కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు వసుంధర రాజే కూడా రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తోంది.
తాను నిప్పులాంటి మనిషినని, ముక్కుసూటిగా మాట్లాడుతానంటూ అస్తమానం చెప్పుకునే చంద్రబాబు ‘ఓటుకు కోట్లు’ స్కామ్‌లో పీకలోతువరకు మునిగిపోయి కుడిదిలోపడ్డ ఎలుకలాగా గిలగిలా కొట్టుకుంటూ తత్తరబిత్తర సమాధానాలు ఇస్తున్నారు. దొరికితేనే దొంగనా, దొరకని దొంగలు గురించి ఆలోచించరా? అని ఆయన తరఫు విజ్ఞులు ప్రశ్నిస్తున్నారు. అవును మరి. దాదాపు 700 కోట్ల రూపాయల కుంభకోణం కేసులో దేశం విడిచి పారిపోయిన లలిత్ మోదీకి సుష్మ మానవతా దృక్పథంతో సహాయం చేయడంలో ఎంత విజ్ఞత ఉందో, వీరిలోనూ ఆ విజ్ఞత అంతే ఉంది.
సాధారణంగా ఇలాంటి కుంభకోణాల్లో రాజకీయ నాయకులు అడ్డంగా దొరికిపోయినప్పుడు ‘చట్టం తనపని తాను చేసుకుపోతుంది’ అంటూ తెలివిగా తప్పించుకుపోయే వారు. ఇప్పుడా మాట వారి నోటి నుంచి రాకపోవడానికి తెలివిమీరి పోయారని భావించాలా లేక అలా చెబితే మరీ దొరికిపోతామనే భయమా? ఏదేమైనా, కేసుల తీవ్రత వేరైనా ఇటు ఓటుకు కోట్లు, అటు మోదీ వీసా కేసు లాజిక్ ఎండ్‌కు వెళతాయా, దోషులకు శిక్ష పడుతుందా, లేదా? అన్నదే ప్రజలకు ప్రధాన ఉత్కంఠ.