పాక్ కు ఆ శక్తి ఇచ్చింది చైనానే..
న్యూఢిల్లీ: అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందం(ఎన్ పీటీ) నిబంధనలను చైనా ఉల్లఘించింది. ఎన్ పీటీలో సభ్యత్వం లేని దేశాలకు న్యూక్లియర్ ఆయుధాలు సరఫరా చేయకూడదని 2010లో ఎన్ పీటీ నిర్ణయం తీసుకుంది. నిబంధనలకు విరుద్ధంగా పాకిస్తాన్ కు చైనా న్యూక్లియర్ రియాక్టర్లను సరఫరా చేసింది. అణ్వస్త్ర వ్యాప్తి గ్రూప్ ను పర్యవేక్షించే ఆర్మ్స్ కంట్రోట్ అసోసియేషన్(ఏసీఏ) తన తాజా రిపోర్టుల్లో ఈ విషయాన్ని గుర్తించింది.
న్యూక్లియర్ సప్లైయర్స్ గ్రూప్(ఎన్ఎస్జీ)లో భారత్ సభ్యత్వానికి చైనా ఎన్ పీటీలోని ఈ నిబంధనను పావుగా వాడుకుని అడ్డుగా నిలిచింది. చైనా-పాకిస్తాన్ ల మధ్య 2013లో జరిగిన ఒప్పందం ప్రకారం చస్మా-3 న్యూక్లియర్ రియాక్టర్లను పాకిస్తాన్ కు ఇచ్చింది. దాంతో 2010 అంతర్జాతీయ స్థాయిలో ఎన్ పీటీ చేసిన నిబంధనలను తుంగలో తొక్కింది. చస్మా-3 రియాక్టర్లను అందుకోవడానికి తమకు అర్హత లేదని తెలిసినా పాకిస్తాన్ వెనకడుగు వేయలేదు.
2004 లో చైనా ఎన్ఎస్ జీలో సభ్యత్వాన్ని నమోదు చేసుకుంది. అయితే, ఎన్ఎస్ జీలో సభ్యత్వానికి ముందే పాకిస్తాన్ కు రియాక్టర్లను ఇచ్చినట్లు చైనా వాదిస్తోంది. అధికారిక రిపోర్టులలో చైనా నిబంధనలను ఉల్లఘించిందని తేలినా.. తానే తప్పు చేయలేదని బుకాయిస్తోంది. పాకిస్తాన్ లోని చస్మా న్యూక్లియర్ పవర్ కాంప్లక్స్ కు మొత్తం 6 రియాక్టర్లను చైనా అందించింది. వీటిలో రెండు రియాక్లర్లు మాత్రమే 2003లో పాకిస్తాన్ కు అందించింది. ఎన్ఎస్ జీలో సభ్యత్వం కలిగిన దానిగా 4 రియాక్టర్లను అందించింది.
ఎగుమతులను క్రమంగా పర్యవేక్షిస్తూ వస్తున్న చైనా.. ఎన్ఎస్ జీకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే పాకిస్తాన్ కు రియాక్టర్లను సరఫరా చేస్తూ వస్తోంది. న్యూక్లియర్ ఆయుధాలకు సంబంధించి ఎటువంటి సాయాన్ని వేరే దేశాలకు అందించకుండా ఉంటేనే ఎమ్ టీసీఆర్ లో సభ్యత్వం తీసుకునే అవకాశం ఉంటుంది.2000లో మిస్సైల్ టెక్నాలజీ కంట్రోల్ రిజైమ్(ఎమ్ టీసీఆర్) నిబంధనలకు ఒప్పుకున్న చైనా అందులో సభ్యత్వం తీసుకుంది. చైనాపై నాలుగేళ్ల నిరంతర పర్యవేక్షణ అనంతరం 2004లో చైనా ఎన్ఎస్ జీ సభ్యత్వానికి గ్రీన్ సిగ్నల్ వచ్చింది.
ప్రస్తుతం ఎమ్ టీసీఆర్ లో సభ్యత్వం కలిగిన భారత్ ఎన్ఎస్ జీ ఆప్లికేషన్ ను చైనా ఆమోదించకుండా, తిరస్కరించకుండా నిలిపివేసింది. నిబంధనల ఉల్లంఘనను ఎమ్ టీసీఆర్ తీవ్రంగా పరిగణించే అవకాశం ఉంది. అయితే, ఎమ్ టీసీఆర్ నిబంధనలను చైనా స్వచ్ఛందంగా పాటిస్తోంది. 2016లో చైనాలో ఓ ప్రభుత్వ సంస్థ చేసిన సర్వేలో చైనా తనకు కావలసిన దేశాలకు న్యూక్లియర్ టెక్నాలజీని అందిస్తున్నట్లు తేలింది.