మలేసియా విమానం శిథిలాల ఆచూకీ?
ఆచూకీ తెలియకుండా పోయిన మలేసియన్ ఎయిర్లైన్స్ విమానం శిథిలాలు దక్షిణ చైనా సముద్రంలో దొరికాయంటూ.. వాటికి సంబంధించిన మూడు శాటిలైట్ చిత్రాలను చైనా విడుదల చేసింది. వీటిని స్టేట్ అడమ్మినిస్ట్రేషన్ ఆఫ్ సైన్స్, టెక్నాలజీ, ఇండస్ట్రీ ఫర్ నేషనల్ డిఫెన్స్ సంస్థ విడుదల చేసింది. మూడు భారీ వస్తువులు సముద్రంలో తేలుతున్నట్లుగా ఆ చిత్రాల్లో ఉంది. వాటిలో ఒకటి 24 మీటర్ల వెడల్పు, 22 మీటర్ల పొడవు ఉండగా, మరొకటి 13 మీటర్ల వెడల్పు, 18 మీటర్ల పొడవు, ఇంకొకటి 14 మీటర్ల వెడల్పు, 19 మీటర్ల పొడవు చొప్పున ఉన్నాయి. మలేసియా, వియత్నాం మద్యలో ఈ వస్తువులున్నాయి. ఇంతకుముందు కూడా కొన్ని శిథిలాలు కనిపించినట్లు చెప్పినా, అవేవీ కూడా అదృశ్యమైన ఎంహెచ్-370 విమానానికి సంబంధించినవి కావని తేలింది. తర్వాత చైనాకు చెందిన పది ఉపగ్రహాలు ఈ విమానం ఆచూకీ కోసం గాలించాయి.
మొత్తం 239 మంది ప్రయాణికులు, సిబ్బంది ఉన్న ఈ విమానం ఆచూకీ కోసం ఆరు రోజులుగా ప్రయత్నిస్తున్నా, చైనా అందించిన సమాచారం తప్ప ఎలాంటి వివరాలు ఇంతవరకు తెలియలేదు. ఈ విమానంలో ఐదుగురు భారతీయులతో పాటు 154 మంది చైనీయులు కూడా ఉన్నారు. వేర్వేరు దేశాలకు చెందిన 42 నౌకలు, 39 విమానాలు ఈ విమానం కోసం గాలిస్తున్నాయి. శనివారం తెల్లవారుజామున కౌలాలంపూర్ నుంచి బీజింగ్ వెళ్తుండగా ఈ విమానం ఏటీసీతో సంబంధాలు కోల్పోయింది.