మలేసియా విమానాన్ని హైజాక్ చేశారా?
సిడ్నీ: రెండేళ్ల క్రితం మలేసియా ఎయిర్ లైన్స్ ఎంహెచ్ 370 విమానం అదృశ్యమైన ఘటన మిస్టరీగానే మిగిలిపోయింది. విమాన ప్రమాదానికి గల కారణాలేంటి? ఎక్కడ కూలిపోయింది? వంటి విషయాలు ఇప్పటికీ తేలలేదు. విమానంలోని ప్రయాణికులు హైజాక్ చేశారన్న వాదన కొత్తగా వినిపిస్తోంది. కొందరు విదేశీయులు విమానాన్ని దారి మళ్లించారని సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. కాగా ఈ విమానం హిందూ మహాసముద్రంలో కూలిపోయినట్టు మలేసియా అధికారులు భావిస్తున్నా.. ప్రమాదానికి కచ్చితమైన కారణమేంటన్నది ఇంకా నిర్ధారించలేదు.
విమానంలోని ప్రయాణికులు ఒకరు లేదా ఎక్కువ మంది హైజాక్ చేసిఉంటారన్న వార్తలు ఇటీవల వచ్చాయి. తప్పుడు పాస్ట్ పోర్టులతో ఇద్దరు ఇరాన్ దేశస్తులు ప్రయాణించడం అనుమానాలకు తావిస్తోంది. అయితే వీరిద్దరికీ ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు లేవని విచారణాధికారులు స్పష్టం చేశారు. బీజింగ్కు వెళ్లాల్సిన విమానాన్ని విదేశీయులు దారి మళ్లించారని సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. విమానం ఆచూకీ కనుగొనేందుకు నియమించిన దర్యాప్తు బృందానికి నాయకత్వం వహిస్తున్న ఆస్ట్రేలియన్ ట్రాన్స్పోర్ట్ సేఫ్టీ బ్యూరో చీఫ్ కమిషనర్ మార్టిన్ డొలాన్ ఈ ఆరోపణలను ఖండించారు. కొందరు విమర్శలు, ఆరోపణలు చేస్తున్నారని, అయితే అంతుచిక్కని మిస్టరీగా మారిన విమాన అదృశ్యానికి గల కారణాలు కచ్చితంగా తెలియరాలేదని వెల్లడించారు. ఇదిలావుండగా, హిందూ మహాసముద్రంలో డీగో గార్కియాలోని అమెరికా సైనిక స్థావరం వైపు వెళ్తున్న ఈ విమానాన్ని.. దాడి చేసేందుకు వస్తోందని భావించి అమెరికా దళాలు కూల్చివేశాయని గతంలో ఓ కథనం వెలువడింది. అయితే దీన్ని అమెరికా తోసిపుచ్చింది.
2014 మార్చి 8న కౌలాలంపూర్ నుంచి బీజింగ్కు 239 మందితో వెళ్తున్న బోయింగ్ 777 అదృశ్యమైన సంగతి తెలిసిందే. ఈ విమానానికి చెందినవిగా భావిస్తున్న శకలాలను గుర్తించారు. గతేడాది హిందూ మహాసముద్రంలోని రీయూనియన్ దీవిలో, ఇటీవల మొజాంబిక్ సముద్రతీరంలో మరో శకలాన్ని గుర్తించారు. కాగా మలేసియా, ఆస్ట్రేలియా ప్రభుత్వాలు తమ సిబ్బందిని రంగంలోకి దింపి విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టినా విమానం కూలిన ప్రాంతాన్ని గుర్తించలేకపోయాయి.