
డోక్లాం ప్రతిష్టంభన: బుద్ధి చాటుకున్న డ్రాగన్!
భారత్ బలగాలు మాత్రమే వైదొలిగాయి
మేం యథాతథంగా గస్తీ నిర్వహిస్తున్నాం: చైనా
సాక్షి, న్యూఢిల్లీ: భారత్, చైనా, భూటాన్ దేశాల మధ్య ఉన్న ట్రై జంక్షన్ 'డోక్లాం'లో సైన్యాన్ని వెనక్కు రప్పించేందుకు భారత్, చైనాలు ఒప్పుకున్నాయని భారత విదేశాంగ శాఖ ప్రకటించిన కాసేపటికే చైనా భిన్నంగా స్పందించింది.. వివాదాస్పద డోక్లాం కొండప్రాంతం నుంచి భారత్ మాత్రమే తన సైన్యాలను ఉపసంహరించుకుందని, చైనా సైన్యం ఇంకా అక్కడ గస్తీ కొనసాగిస్తోందని స్పష్టం చేసింది. ఈ ప్రాంతంలో తన సార్వభౌమాధికారాన్ని కొనసాగిస్తామని మరోసారి పేర్కొంది.
డోక్లాంలో రెండు నెలలుగా భారత్-చైనా సైన్యాల మధ్య ప్రతిష్టంభన కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ ప్రతిష్టంభనకు ద్వైపాక్షిక చర్చల ద్వారా పరిష్కరించుకున్నట్లు భారత్ తెలిపింది. సాధ్యమైనంత త్వరగా ఇరు దేశాలూ తమ సైన్యాన్ని డోక్లాం సరిహద్దు నుంచి ఉప సంహరించే ప్రక్రియను ముగిస్తాయని కూడా భారత్ స్పష్టం చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చైనా పర్యటన నేపథ్యంలో డోక్లాం వివాదానికి ఈ మేరకు తెరదించినట్టు భారత్ విదేశాంగ శాఖ ప్రకటించగానే.. చైనా అందుకు భిన్నంగా స్పందించడం గమనార్హం. 'చారిత్రక ఒప్పందాల ప్రకారం చైనా తన సార్వభౌమాధికారాన్ని యథాతథంగా కొనసాగిస్తూ.. ప్రాంతీయ సమగ్రతను కాపాడుకుంటుంది' అని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి హు చున్యింగ్ తెలిపారు. ఈ నెల 28న (సోమవారం) భారత్ తన చొరబాటు చేసిన బలగాలను, సైనిక సంపత్తిని ఉపసంహరించుకుందని, చైనీస్ బలగాలు మాత్రం దేశ సార్వభౌమాధికార, ప్రాదేశిక సమగ్రతకు సంబంధించి చట్టబద్ధమైన హక్కులను, ప్రయోజనాలను కాపాడేందుకు ఈ ప్రాంతంలో మరింత సమర్థమైన చర్యలు తీసుకుంటున్నాయని చెప్పారు.
'భారత్‌తో స్నేహపూర్వక సంబంధాలకు చైనా ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యం ఇస్తోంది. భారత్ కూడా చారిత్రక సంబంధాల కట్టుబడి.. అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగా పరస్పర సార్వభౌమాధికారాన్ని గౌరవిస్తుందని, సరిహద్దుల్లో శాంతి, భద్రతలకు సహకరిస్తుందని ఆశిస్తున్నాం' అని హు చున్యింగ్ తెలిపారు.