చైనా మానవ రహిత యుద్ద విమానం 'లిజియన్'ను అభివృద్ధి చేసింది. ఆ లిజియన్ను గురువారం ఇక్కడ విజయవంతంగా ప్రయోగించింది. లిజియన్ అంటే చైనీయుల భాషలో పదునైన కత్తి అని అర్థం.దాంతో లిజియన్ ఆకాశంలో కత్తిలా దూసుకుపోయింది. దీంతో మానవరహిత యుద్దవిమానాన్ని ఆసియా ఖండంలో తయారు చేసిన మొట్టమొదటి దేశం చైనాగా ఖ్యాతిగాంచింది.
చైనా తూర్పు, పశ్చిమ ప్రాంతంలోని సముద్రంలో జరగుతున్న పరిణామాలు ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు లిజియన్ ఉపకరిస్తుందని, అలాగే చైనాకు పొరుగుదేశాల మధ్య నెలకొన్న ప్రాదేశిక సరిహద్దు వివాదాలపై బీజింగ్ నాయకులకు లిజియన్ ఒక చక్కటి సాధనమని చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ చెందిన మాజీ జనరల్ వెల్లడించారని హాంకాంగ్కు చెందిన వార్తా పత్రిక వెల్లడించింది.
చైనా దేశంలోని అధునిక సైనిక అద్బుత పాటవానికి లిజియన్ ప్రతీక అని పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ విశ్రాంత ఉద్యోగి మేజర్ జనరల్ ఝు గుంగ్యు వెల్లడించారు. అభివృద్ధితో ముందుకు దూసుకువెళ్తున్న దేశాల అధునిక విజ్ఞానాన్ని చైనా అందిపుచ్చుకుందనటానికి ఉదాహరణ లిజియన్ అని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికే మానవ రహిత యద్ధ విమానాలు యూఎస్, బ్రిటన్, ఫ్రాన్స్ దేశాలు రూపొందించాయని ఆయన గుర్తు చేశారు. లిజియన్ యూఎస్ మిలటరీలోని ఎక్స్-78బి ద్రోణ్ను పోలి ఉంటుందని తెలిపారు.