
ఆందోళన రేపుతున్న చైనా ఫొటోలు!
న్యూఢిల్లీ: తన మొదటి దేశీయ విమాన వాహక యుద్ధనౌకను చైనా శరవేగంగా పూర్తిచేస్తున్నట్టు తాజాగా వెలుగులోకి వచ్చిన ఫొటోలను బట్టి తెలుస్తున్నది. అత్యంత ఆధునికమైన యుద్ధనౌకను టైప్ 001-ఏ పేరిట చైనా రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ఒక కృత్రిమ దీవి తరహాలో అత్యాధునికమైన సాంకేతిక హంగులతో దీనిని తయారుచేస్తోంది. ఈ ‘ఐలాండ్’లో యుద్ధనౌక వంతెనలు, యుద్ధ విమానాయాన సౌకర్యాలు, యుద్ధ నియంత్రణ సాంకేతికత, ర్యాడర్లు, స్పెన్సర్లు ఇలా అత్యాధునిక హంగులు ఉండనున్నాయి.
తూర్పు బీజింగ్‌కు చేరువలోని డాలియన్ ఓడరేవు పట్టణంలో.. ఓ ఎండిపోయిన డాక్‌యార్డ్ వద్ద టైప్ 001-ఏ యుద్ధ వాహకనౌక నిర్మాణం అవుతోంది. దీని బరువు 60వేల టన్నుల వరకు ఉంటుంది. ఇందులో 50 యుద్ధ విమానాలు తరలించవచ్చు. రష్యా ఎస్‌యూ-27 అనుగుణంగా చైనా రూపొందించిన జే-15 ఫైటర్ విమానాలు 36ని ఇందులో తీసుకుపోవచ్చు. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ఈ భారీ యుద్ధనౌకకు త్వరలోనే సముద్ర ట్రయల్స్ నిర్వహిస్తారని భావిస్తున్నారు. అయితే, ఇది పూర్తిస్థాయిలో 2020 నాటికి చైనా నేవీకి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. చైనా రూపొందిస్తున్న రెండో దేశీయ యుద్ధనౌక ఇది.
రష్యా రూపొందించిన లియానింగ్ నౌక ఆధారంగా ఇది రూపొందుతున్నట్టు భావిస్తున్నారు. ఈ భారీ యుద్ధనౌకతోపాటు కొత్త జే-15 ఫైటర్ విమానాల ఫొటోలు తాజాగా చైనా సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. ఈ ఫొటోలు చైనా వైమానిక యుద్ధనౌకలు, ఫైటర్ విమానాల సామర్థ్యాన్ని చాటుతున్నాయి. ఈ ఫొటోలు రక్షణపరంగా భారత్‌కు ఆందోళన కలిగించేవేనని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. భారత్ ఇప్పటికే దేశీయంగా విక్రాంత్ వైమానిక యుద్ధ నౌకను రూపొందించి.. మూడేళ్ల కిందట కోచి తీరంలో ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే.