గుడ్బై చెప్పిన మొదటి మహిళ అధినేత!
గుడ్బై చెప్పిన మొదటి మహిళ అధినేత!
Published Fri, Dec 2 2016 4:43 PM | Last Updated on Mon, Sep 4 2017 9:44 PM
దేశీయంగా అతిపెద్ద స్టాక్ ఎక్స్చేంజ్గా పేరున్న నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్కు మొదటి మహిళా మేనేజింగ్ డైరెక్టర్గా, చీఫ్ ఎగ్జిక్యూటివ్గా బాధ్యతలు నిర్వహిస్తున్న చిత్రా రామకృష్ణ ఆమె పదవికి గుడ్ బై చెప్పారు. చిత్రా రామకృష్ణ తన పదవి నుంచి దిగిపోయినట్టు బోర్డులోని సంబంధిత వర్గాలు చెప్పాయి. రోజువారీ కార్యకలాపాల కోసం తాత్కాలికంగా రామకృష్ణ స్థానంలో జే రవిచంద్రన్ను ఎన్ఎస్ఈ నియమించింది. ఆయన ప్రస్తుతం గ్రూప్ ప్రెసిడెంట్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. చిత్రా రామకృష్ణ రాజీనామా విషయాన్ని ఎన్ఎస్ఈ త్వరలోనే స్టామ్ మార్కెట్ నియంత్రణ మండలి సెబీకి వెల్లడించనుంది.
ఆమె వ్యక్తిగత కారణాలతోనే తన పదవికి రాజీనామా చేసినట్టు తెలిసింది. ఎన్ఎస్ఈకి తొలి మహిళ అధినేతగానే కాక, ఇటీవలే వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ ఎక్స్చేంజస్(డబ్యూఎఫ్ఈ)కి మొదటి మహిళా చైర్గా కూడా ఆమె ఎంపికయ్యారు. డబ్యూఎఫ్ఈ ప్రపంచవ్యాప్తంగా 45వేల లిస్టెడ్ కంపెనీలకు అసోసియేషన్ గా ఉంటోంది. ఎన్ఎస్ఈకి తొలి మహిళా అధినేతగా ఆమె ఆ పదవిలో 2013 ఏప్రిల్ నుంచి కొనసాగుతున్నారు. 2009 నుంచి 2013 వరకు ఎక్స్చేంజ్కు చిత్రా రామకృష్ణన్ జాయింట్ ఎండీగా పనిచేశారు. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇండియాకు డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్గా, లిస్టింగ్ హెడ్గా కూడా ఆమె సేవలందించారు. ఎన్ఎస్ఈ ఏర్పాటుచేసిన స్టార్టప్ టీమ్ లో రామకృష్ణన్ ఓ భాగంగా ఉన్నారు. అయితే ఆమె వైదొలగడం ఎన్ఎస్ఈ కార్యకలాపాలపై ఎలాంటి ప్రభావం చూపదని బీఎస్ఈ, ఎన్ఎస్ఈ మెంబర్ దీపన్ మెహతా చెప్పారు.
Advertisement
Advertisement