national stock exchange Scam: చిత్రా రామకృష్ణ... ఇప్పుడు ఇంటర్నెట్‌లో అత్యధికులు వివరాలు వెతుకుతున్న పేరు ఇది. దేశవ్యాప్తంగా ఆమె ఇప్పుడు అంత సంచలనం మరి! నేషనల్ స్టాక్ ఎక్స్‌ఛేంజ్ (ఎన్‌ఎస్‌ఈ)కి సారథ్యం వహించిన ఓ మనిషి గుర్తుతెలియని ఓ ‘యోగి’ పుంగవుడి ‘మార్గదర్శకత్వం’లో నిర్ణయాలు తీసుకున్నానంటూ చెబితే సంచలనం కాక మరేమవుతుంది! ఎవరి సలహానో, ఏమి సాన్నిహిత్యమో కానీ ‘ఎన్‌ఎస్‌ఈ’కి ముక్కూమొహం తెలియని ఆనంద్ సుబ్రమణియన్ అనే వ్యక్తిని తనకు వ్యూహాత్మక సలహాదారుగా, గత జీతం కన్నా పది రెట్లు ఎక్కువకు తీసుకురావడాన్ని ఏమని అర్థం చేసుకోవాలి? ఏ విషయంలోనూ అంత పట్టు, గ్రహణశక్తి లేని సదరు ఆనంద్ జీతం ఆ పైన మూడు రెట్లు పెరిగి, రూ. 4 కోట్లు ఎలా పెరిగింది? ‘ఎన్‌ఎస్‌ఈ’లో జరిగిన గోల్‌మాల్‌పై సెక్యూరి టీస్ అండ్ ఎక్స్‌ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ), ఆదాయపన్ను శాఖ సహా పలు సంస్థలు చేస్తున్న దర్యాప్తుతో డొంకంతా కదులుతోంది. ఆరేళ్ళ క్రితపు చిత్ర ఇ–మెయిల్స్‌ను ‘సెబీ’ తాజాగా బయట పెట్టడంతో ఇన్వెస్టర్లే కాదు... ఇండియా మొత్తం నివ్వెరపోతోంది.
అత్యున్నత పదవుల్లోని మేధావులు సైతం మానసిక ప్రశాంతత కోసమో, మరిదేనికో తమకు నచ్చిన ‘గురువు’లనో, ‘గాడ్‌మన్’లనో ఆశ్రయించడం చరిత్రలో చూస్తున్నదే. అమెరికా లాంటి చోట్లా ప్రఖ్యాత సీఈఓలకూ ఆ ఘన చరిత్ర ఉంది. ప్రఖ్యాత యాపిల్ సంస్థ సహ–వ్యవస్థాపకుడు స్టీవ్ జాబ్స్ కూడా ఒక దశలో ఓ భారతీయ గురువు ప్రభావంలో గడిపారు. అయితే, అలాంటి వారి మధ్య ఆ సాన్నిహిత్య వేళ సాగిన సంభాషణలు ఇప్పుడు బయటకొస్తే విచిత్రంగానే అనిపిస్తాయి. చిత్ర ఇప్పుడు ఆ జాబితాకు ఎక్కారు. కాకపోతే, హిమాలయాల్లో సంచరించే నిరాకారుడైన సిద్ధ పురుషుడని ఆమె చెబుతున్న వ్యక్తికి ఇ–మెయిల్ అడ్రస్ ఉండడం, ఆమె కేశశైలి నుంచి అందం, ఆహార్యాలను ఆయన ప్రత్యేకంగా అభినందించడం, ఐహిక బంధం ఉండని ఆ వ్యక్తి ఆమెతో కలసి సేషెల్స్‌కు సేదతీరదామనడం, అతి గోప్యంగా ఉండాల్సిన కార్పొరేట్ సమాచారాన్నీ, సమావేశాల అజెండానూ, పంచవర్ష పురోగమన ప్రణాళికలనూ ఆయనకు ఆమె అందించడమే చిత్రాతిచిత్రం!
నేషనల్ స్టాక్ ఎక్స్‌ఛేంజ్ (ఎన్‌ఎస్‌ఈ)ను బలంగా నిలబెట్టిన కీలక సభ్యుల్లో ఒకరూ, సాక్షాత్తూ మాజీ సీఈఓ అయిన ఒక వ్యక్తి ఇలాంటి పని చేయడం అంతుపట్టని విషయమే. ‘ఎన్‌ఎస్‌ఈ’ని స్థాపించిన 1992 నాటికి చిత్ర ఓ యువ ఛార్టెర్డ్ ఎకౌంటెంట్. ఐడీబీఐలో పనిచేస్తున్న ఆమె తెలివితేటలకు ముచ్చటపడి, ‘ఎన్‌ఎస్‌ఈ’కి ఎంపిక చేసిన అయిదుగురి కీలక సభ్యుల్లో ఒకరిగా తీసుకున్నారు. అక్కడ నుంచి ఆమె పురోగతి అనూహ్యం. సరిగ్గా రెండు దశాబ్దాలలో 2013 ఏప్రిల్ నాటికల్లా ‘ఎన్‌ఎస్‌ఈ’కి మేనేజింగ్ డైరెక్టర్ – సీఈఓ అయ్యారు. తమిళనాడులోని సంప్రదాయ కుటుంబానికి చెందిన చిత్రకు దైవభక్తి, అంతకు మించి అనేక నమ్మకాలు. గత రెండు దశాబ్దాల తన ప్రగతి, ‘ఎన్‌ఎస్‌ఈ’ పురోగతికి సదరు అభౌతిక ‘యోగి’ సలహాలే కారణమని ఆమె భావన. వ్యక్తిగత నమ్మకాల మాటెలా ఉన్నా, గోప్యంగా ఉంచాల్సిన కార్పొరేట్ సమాచారాన్ని ఆమె తన గుర్తు తెలియని ‘మార్గదర్శకుడి’కి అన్నేళ్ళుగా ఇ–మెయిల్స్ ద్వారా ఎలా చేరవేస్తున్నారన్నది ప్రశ్న. అసలప్పుడు ఆమె మానసిక పరిస్థితి ఎలా ఉందనేది అర్థం కాని విషయం. ఆనంద్ సహా ఆ యోగి ఎవరై ఉంటారన్నది ఆసక్తికరం. ఆమె నిర్ణయాల వల్ల స్టాక్ మార్కెట్లకూ, రిటైల్ మదుపరులకూ ఎంత భారీయెత్తున నష్టం వాటిల్లి ఉంటుందో ఊహించుకోవచ్చు. అందుకే, ఈ వ్యవహారాన్ని ఆధ్యాత్మికతగా కన్నా ఆర్థిక మోసంగానే అత్యధికులు భావిస్తున్నారు.
దేశంలో ఆర్థిక సరళీకరణ మొదలైన ఏడాదికే 1992 ఏప్రిల్‌లో హర్షద్ మెహతా స్టాక్ మార్కెట్ కుంభకోణం బయటపడింది. సాంకేతికత, పారదర్శకత నిండిన ఆధునిక స్టాక్ ఎక్స్‌ఛేంజ్ అవసర మని అప్పట్లో సర్కారు గుర్తించడంతో ‘ఎన్‌ఎస్‌ఈ’ ఆవిర్భవించింది. తీరా అక్కడా అనేక అక్రమాలే నని ఇప్పుడు తేలింది. ఆధునిక భారతావనికి ప్రతీకగా, ప్రపంచంలోని అతి పెద్ద స్టాక్ ఎక్స్‌ఛేంజ్ లలో ఒకదానికి మూడున్నరేళ్ళు సారథ్యం వహించిన మహిళాశక్తిగా నీరాజనాలు అందు కున్న చిత్ర ఇలా అట్టడుగుకు జారిపోవడం విషాదమే. స్టాక్ బ్రోకర్లైన కొందరికి అనుచిత సాయం చేశారంటూ వచ్చిన ఆరోపణలతో 2016 డిసెంబర్‌లో ఆమె తన పదవి నుంచి పక్కకు తప్పుకోవాల్సి వచ్చింది. అప్పట్లోనే ఆమె తప్పులు, అక్రమాల గురించి తెలిసినా సరే, ‘ఎన్‌ఎస్‌ఈ’ బోర్డు నోరు విప్పలేదు. సెబీకి చెప్పలేదు. ప్రశంసిస్తూనే, సాగనంపింది. అందుకు హేతువేమిటో అర్థం కాదు. కరోనా తర్వాత మార్కెట్ పుంజుకుంటోదని భావిస్తున్న వేళ ఈ కథ ఇప్పుడే ఎందుకు బయటకొచ్చిందో తెలీదు.
అవినీతి, అక్రమాలు, కార్పొరేట్ నిర్వహణలో తప్పులు, అంతుచిక్కని అనుబంధాలతో కూడిన చిత్ర ఉదంతం అచ్చంగా ఓ వెబ్‌సిరీస్. ఇంత జరుగుతుంటే, స్టాక్ ఎక్స్‌ఛేంజ్‌ను నియంత్రించాల్సిన ‘సెబీ’ కుంభకర్ణ నిద్ర పోతోందా? ఈ కథలో చిత్ర అమాయకంగా ఎవరి చేతిలోనో మోసపోయారా, లేక ఆర్థిక అక్రమాల బృహత్ప్రణాళికలో ఆమె కూడా ఓ భాగమా? ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు జవాబు తెలియాలి. ఇప్పటికైనా ‘ఎన్‌ఎస్‌ఈ’లో ఏం జరిగిందో లోతుగా దర్యాప్తు చేయాలి. ఈ వ్యవస్థాగత వైఫల్యంలో తెర వెనుక బండారాన్ని బయటకు తీయాలి. నమ్మకంతో కోట్లాది రూపాయలు విపణిలో పెట్టే అమాయక మదుపరుల ఆర్థిక క్షేమంపై అనుమానాలు ప్రబలుతున్న వేళ అది అత్యంత కీలకం. విచిత్ర మానసిక స్థితితో ‘యోగి సత్యం... మెయిల్ మిథ్య’ అని కూర్చుంటేనే కష్టం!
NSE Scam: యోగి సత్యం! మెయిల్ మిథ్య?
Published Tue, Feb 22 2022 12:44 AM | Last Updated on Tue, Feb 22 2022 10:54 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment