సెలవు కోసం గొడవ.. నలుగురిని కాల్చేశాడు!
సెలవు కోసం గొడవ.. నలుగురిని కాల్చేశాడు!
Published Thu, Jan 12 2017 6:13 PM | Last Updated on Tue, Sep 5 2017 1:06 AM
అతడు రెండు నెలల పాటు యోగా శిబిరానికి హాజరై వచ్చాడు. మళ్లీ సెలవు కావాలన్నాడు. ఏం జరిగిందో ఏమోగానీ అతడికి ఒక్కసారిగా కోపం వచ్చింది. చేతిలో ఉన్న ఇన్సాస్ రైఫిల్ తీసుకున్నాడు.. దాన్ని అన్‌లాక్ చేశాడు.. విచక్షణారహితంగా కాల్పులు జరిపి నలుగురు తోటి జవాన్లను బలిగొన్నాడు. ఈ ఘటన బిహార్‌లోని ఔరంగాబాద్ జిల్లాలో గల నబీ నగర్ పవర్ జనరేషన్ కంపెనీ లిమిటెడ్ (ఎన్పీజీసీఎల్) యూనిట్లో జరిగింది. నిందితుడు బల్వీర్‌సింగ్ జరిపిన కాల్పుల్లో ముగ్గురు హెడ్ కానిస్టేబుళ్లతో పాటు ఒక ఏఎస్ఐ కూడా ప్రాణాలు కోల్పోయారని ఎస్పీ సత్యప్రకాశ్ తెలిపారు. ప్రస్తుతం నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నామన్నారు. వారిలో ముగ్గురు అక్కడికక్కడే మరణించగా, మరొకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు వదిలారు. విధులు ముగించుకుని షిఫ్ట్ మారుతున్న సమయంలో జవాన్లు ఒకచోట చేరారు. ఇంతలో అక్కడ చిన్న వివాదం తలెత్తడంతో అకస్మాత్తుగా బల్వీర్ సింగ్ కాల్పులకు తెగబడ్డాడు.
"బల్వీర్ తన సర్వీస్ రైఫిల్ తో తోటి ఉద్యోగులపై కాల్పులు జరిపాడు. ముగ్గురు జవాన్లు అక్కడికక్కడే మరణించారు. మరొకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. ఇది సహోదర హత్యతో సమానం" అని ఎస్పీ అన్నారు. ఘటనా స్థలాన్ని ఉన్నతాధికారులు పరిశీలించారని తెలిపారు. ఈ ఘటనపై కోర్టు విచారణకు ఆదేశించిందని సీఐఎస్ఎఫ్ పేర్కొంది. బిహార్ విద్యుత్తు బోర్డులో ఎన్టీపీసీ, ఎన్సీజీసీఎల్ జాయింట్ వెంచర్‌గా నడుస్తున్నాయి.
Advertisement