ఫేస్‌బుక్‌లో ఫొటోలు పెట్టాడని.. బాలిక ఆత్మహత్య
సోషల్ మీడియా.. మరో చావుకు కారణమైంది. ప్రేయసి తనకు దూరమైందన్న ఉక్రోషంతో ఓ యువకుడు గతంలో తామిద్దరం సన్నిహితంగా ఉన్న ఫొటోలను ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశాడు. దాంతో మనస్తాపానికి గురైన బాలిక ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన పశ్చిమబెంగాల్‌లోని దక్షిణ 24 పరగణాల జిల్లా బిష్ణుపూర్‌లో జరిగింది. ఫేస్‌బుక్‌లో వీళ్ల ఫొటోలు విపరీతంగా సర్క్యులేట్ కావడంతో పాటు వాటికి కామెంట్లు కూడా పిచ్చిపిచ్చిగా వస్తుండటంతో ఆమె తట్టుకోలేకపోయింది.
20 ఏళ్ల యువకుడికి, 12వ తరగతి చదివే బాలికు మధ్య మూడేళ్ల పాటు ప్రేమాయణం నడిచింది. అయితే, ఏడాది క్రితం కుటుంబ సమస్యల కారణంగా వాళ్లిద్దరూ విడిపోయారు. దీనిపై మౌనంగా ఉండకపోతే ఆ ఫొటోలను ఫేస్‌బుక్‌లో పెడతానంటూ యువకుడు చాలాసార్లు బెదిరించాడు. చిరవకు తాను అన్నంత పనీ చేశాడు. ఆ బాధను తట్టుకోలేని బాలిక.. ఆదివారం రాత్రి ఆత్మహత్య చేసుకుంది. ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవద్దని బాలిక తల్లిని సైతం అతడు బెదిరించాడు. దాంతో అతడి గురించి బాలిక తల్లి పోలీసులకు ముందే ఫిర్యాదు చేసింది. అయితే పోలీసులు స్పందించి చర్యలు తీసుకునేలోపే బాలిక ప్రాణాలు తీసుకుంది.