
నోట్ల రద్దు: సీఎం కేసీఆర్ విప్లవాత్మక నిర్ణయాలు
హైదరాబాద్: పెద్దనోట్ల రద్దు అనేది కేంద్ర ప్రభుత్వ నిర్ణయం అని, ఇందులో రాష్ట్రాల పాత్ర ఏమీలేదని తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అన్నారు. అయినా ఈ విషయంలో రాష్ట్రాలు ప్రేక్షకపాత్ర వహించరాదని పేర్కొన్నారు. కేంద్రం నిర్ణయంతో బిత్తరపోయి.. డంగైపోవాల్సిన అవసరంలేదని కేసీఆర్ స్పష్టం చేశారు. పెద్దనోట్ల రద్దుతో ప్రజలకు ఎదురవుతున్న సమస్యలను ప్రధానమంత్రి నరేంద్రమోదీతో పంచుకున్నట్టు తెలిపారు. పెద్దనోట్ల రద్దు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయమని కొనియాడారు. పెద్దనోట్ల రద్దు అనంతరం పరిణామాలపై తెలంగాణ కేబినెట్ సోమవారం భేటీ అయి సుదీర్ఘంగా చర్చించింది. అనంతరం సీఎం కేసీఆర్ మీడియాకు వివరాలు తెలిపారు. పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో తెలంగాణలోని పరిస్థితిని అంచనా వేసేందుకు టాస్క్‌ఫోర్స్ ఏర్పాటుచేసినట్టు తెలిపారు. నల్లధనం ఏ రూపంలో ఉన్నా.. దానిని అరికట్టవచ్చునని అన్నారు.
ఈ వ్యవస్థ మారాలని తాను ఎప్పటినుంచో అనుకునేవాడినని, పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో ప్రధాని మోదీతో తన అనుభవాలు, అవగాహనను పంచుకున్నానని చెప్పారు. పెద్దనోట్ల రద్దుతో తలెత్తిన సమస్యలు, వాటి పరిష్కారాలపై ప్రధానికి నివేదిక ఇచ్చానని తెలిపారు. తన అభిప్రాయాలతో ప్రధాని కూడా ఏకీభవించారని తెలిపారు. 100శాతం నల్లధనం రహిత, అవినీతి రహిత దేశంగా మార్చాలని ప్రధాని మోదీని సీఎం కేసీఆర్ విజ్ఞప్తి చేశారు. ఇందుకు కృషిచేస్తే యావత్ తెలంగాణ మోదీకి అండగా ఉంటుందని అన్నారు.
కేబినెట్లోని కీలక నిర్ణయాలు
- 100శాతం నగదు రహిత లావాదేవీలను చేయాలనే లక్ష్యంతో సిద్దిపేట అసెంబ్లీ నియోజకవర్గాన్ని పైలట్ ప్రాజెక్టు చేపట్టాలని నిర్ణయించాం.
- నగదురహిత లావాదేవీల కోసం టీఎస్ వాలెట్‌ను ప్రవేశపెట్టబోతున్నాం
- పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో జీహెచ్ఎంసీలో కార్మికులు ఉపాధి కోల్పోకుండా చర్యలు తీసుకున్నాం
- ఇందుకోసం నగరంలో డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలని ఆదేశించాం
- రిజిస్ట్రేషన్ కార్యాలయాలు, పౌర సరఫరా కార్యాలయాలు, ఇతర అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో స్వైపింగ్ మిషిన్లను అందుబాటులోకి తీసుకొస్తున్నాం.
- పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో ఖాతాలు ఉన్న ప్రతి ఒక్కరూ బ్యాంకుల ద్వారానే లావాదేవీలు నిర్వహించాలి
- కొనుగోళ్లు, అమ్మకాలు బ్యాంకుల ద్వారానే జరగాలి.
సీఎం కేసీఆర్ చెప్పిన కీలక విషయాలు
- కేంద్రం నిర్ణయాన్ని అమలుచేయడం తప్ప ప్రత్యామ్నాయం లేదు
- చెక్కుల ద్వారా అరటిపండ్లు, కూరగాయాలు కొనే పరిస్థితి లేదు. కాబట్టి నగదు రహిత లావాదేవీలపై కేబినెట్లో చర్చించాం.
- తెలంగాణ రాష్ట్రంలో 85 లక్షల జన్‌ధన్ ఖాతాలు ఉన్నాయి.
- పెద్దనోట్ల రద్దుతో రియల్ ఎస్టేట్ రంగం తీవ్రంగా దెబ్బతిన్నది
- హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ చాలా పెద్దది. కొంతమేర స్తంభించిపోయే అవకాశముంది.