బైపోల్: ముఖ్యమంత్రి ఘనవిజయం!
పనాజీ, సాక్షి: దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఉప ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. గోవాలో జరిగిన ఉప ఎన్నికలో ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ ఘనవిజయం సాధించారు. పనాజీ ఉప ఎన్నికలో 4,803 ఓట్లతో ఆధిక్యంతో గెలుపొందారు. గతంలో కేంద్ర రక్షణమంత్రిగా వ్యవహరించిన మనోహర్ పారికర్ గోవా సీఎంగా బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో పనాజీ ఉప ఎన్నికలో పోటీ చేశారు.
గోవా అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ సీట్లు రాకుండా హంగ్ అసెంబ్లీ ఏర్పడిన నేపథ్యంలో కేంద్రమంత్రి పదవికి రాజీనామా చేసి.. పారికర్ తిరిగి గోవా రాజకీయాల్లో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. పారికర్ తిరిగి సీఎంగా బాధ్యతలు చేపడితేనే.. తాము మద్దతునిస్తామని చిన్నాచితకా పార్టీలు, మిత్రపక్షాలు బీజేపీకి స్పష్టం చేయడంతో తిరిగి ఆయనను పనాజీకి బీజేపీ పంపిన సంగతి తెలిసిందే. త్వరలోనే ఎమ్మెల్యేగా గెలుపొందిన నేపథ్యంలో వచ్చేవారం రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయనున్నట్టు సీఎం పారికర్ తెలిపారు.
కాగా, గోవా ఉప ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటింది. పనాజీ ఉప ఎన్నికలో పారికర్ విజయం సాధించగా.. వాల్పోయ్ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి విశ్వజీత్ రాణె ఘనం విజయాన్ని సొంతం చేసుకున్నారు. సమీప ప్రత్యర్థిపై ఆయన 10,066 ఓట్ల మెజారిటీ సాధించారు.