సీఎంలను ప్రత్యక్షంగా ఎన్నుకోవాలి
న్యూఢిల్లీ: ముఖ్యమంత్రులను ప్రత్యక్ష ఎన్నిక పద్దతిన ఎన్నుకోవాలని లోక్‌సత్తా అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ అన్నారు. ఆదివారం ఢిల్లీలో జరిగిన ఎన్నికల సంస్కరణ సదస్సులో ఆయన మాట్లాడుతూ.. ఎమ్మెల్యేల రాజ్యం పోవాలని, అప్పుడే సీఎం సరైన పాలన ఇవ్వగలరని పేర్కొన్నారు.
ఎన్నికల్లో డబ్బు ప్రభావాన్ని తగ్గించాలని జేపీ అన్నారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లో కృష్ణా జిల్లా గుడివాడ మున్సిపల్ కౌన్సిలర్ ఎన్నిక సందర్భంగా కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టిన సంఘటనను ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఇలాంటివి రాజకీయ ఉన్మాదమని పేర్కొన్నారు. ఎన్నికల వ్యవస్థలో మార్పు వస్తే కానీ నిజమైన ప్రజాస్వామ్యం రాదని చెప్పారు. ప్రభుత్వ ఆఫీసుల్లో పైరవీలు లేకుండా పనులు జరిగే రోజు రావాలని జేపీ పేర్కొన్నారు. గుడివాడ మున్సిపల్ కౌన్సిలర్ ఎన్నికలో అధికార టీడీపీ నాయకులు ఓటుకు 7 వేల నుంచి 10 వేల రూపాయల వరకు డబ్బు పంచినట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.