ఇక కోకా-కోలా కాఫీ, పాలు కూడా..!
ప్రపంచంలోనే సుప్రసిద్ధ కూల్ డ్రింక్ బ్రాండ్ గా విశేష ప్రాచుర్యం పొందిన కోకా-కోలా... తన బ్రేక్ ఫాస్ట్ పానీయాలను విస్తరించేందుకు ప్రణాళికలు రచిస్తోంది. కాఫీ, మిల్క్ పానీయాలను తమ పోర్ట్ ఫోలియోలో బ్రేక్ ఫాస్ట్ ప్రొడక్ట్ లుగా అందించాలనుకుంటోంది. ప్యాకేజ్డ్ అరబికా కాఫీ బీన్స్ ను బ్రెజిలియన్ కన్సూమర్లకు అందించేందుకు ప్రయత్నిస్తోంది. అట్లాంటాకు చెందిన ఈ కంపెనీ, స్థానిక టీ బ్రాండ్ లీయో పేరుతో ప్యాకేజ్డ్ బీన్స్ అమ్మకాలు నిర్వర్తించనుందని కోకా కోలా బ్రెజిల్ యూనిట్ గురువారం ప్రకటించింది. బీన్స్ ను కొనుగోలు చేసి, రోస్ట్ చేయడానికి కాఫీ ఎగుమతిదారి ట్రీస్టో కాంపానిహా డి కమర్సియో ఎక్స్ టీరియర్ తో కోకా-కోలా భాగస్వామ్యం కుదుర్చుకుంది. అయితే ఈ డీల్ కు సంబంధించిన ఎలాంటి వివరాలను కంపెనీ వెల్లడించలేదు.
కోకా-కోలా దశాబ్దన్నర క్రితం నుంచి తన ప్రొడక్ట్ లను విస్తరించుకుంటూ వస్తుందని, జ్యూస్, టీ, మినరల్ వాటర్ వంటి వాటిని అందిస్తుందని బ్రెజిల్ యూనిట్ వైస్ ప్రెసిడెంట్ శాండోర్ హెగెన్ చెప్పారు. ప్రస్తుతం కాఫీ, మిల్క్ ఉత్పత్తులను కూడా తమ పోర్ట్ ఫోలియోలో బ్రేక్ ఫాస్ట్ ప్రొడక్ట్ లుగా చేర్చాలనుకుంటున్నామని పేర్కొన్నారు. బ్రెజిల్ లో పాల ఉత్పత్తుల తయారీదారి లాటిసినోస్ వర్దె క్యాంపొ కంపెనీ కొనుగోలు ప్రక్రియ చివరి దశకు వచ్చిందన్నారు. ప్రస్తుతం కాఫీ డ్రికర్స్ పై ఎక్కువగా దృష్టిసారిస్తున్న కంపెనీ, ఎక్స్ క్లూజివ్ గా అరబికా కాఫీని వారికి అందించాలని ప్లాన్ చేస్తోంది. అరబికా కాఫీని తయారుచేయడంలో బ్రెజిల్ అగ్రస్థానంలో ఉంది.