చదివేది 5.. పేరు రాయరాదు..
♦ ఇదీ.. సర్కారు పాఠశాల విద్యార్థుల దుస్థితి
♦ ఉపాధ్యాయులపై కలెక్టర్ సీరియస్
♦ ఐదుగురు టీచర్ల సస్పెన్షన్
మిడ్జిల్: ‘‘పిల్లలు.. మీ పేరు.. మీ తల్లిదండ్రుల పేర్లు రాయండి’’అని జిల్లా కలెక్టర్ అంటే.. తరగతిలోని ఏ ఒక్కరూ సరిగా రాయలేదు. దీంతో కలెక్టర్ అసలు స్కూల్లో పాఠాలు చెబుతున్నారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటన మహబూబ్‌నగర్ జిల్లా మిడ్జిల్ మండలం వల్లభ్‌రావుపల్లి ప్రాథమిక పాఠశాలలో సోమవారం జరిగింది. జిల్లా కలెక్టర్ రొనాల్డ్‌రోస్ మంగళవారం వల్లభ్‌రావునగర్ ప్రాథమిక పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఐదో తరగతి గదిలో వెళ్లి విద్యార్థులతో ‘టీచర్లు ఎలా చదువు చెబుతున్నారు’అని ప్రశ్నించారు. ఏ ఒక్కరినుంచీ సమాధానం రాలేదు. దీంతో ఒకింత ఆశ్చర్యానికి గురై.. ‘మీ పేర్లు, మీ తల్లిదండ్రుల పేర్లను రాయండి’అన్నారు.
మొత్తం ఈ గదిలో 20 మంది విద్యార్థులుండగా ఏ ఒక్కరూ సరిగా పేరు రాయలేకపోయారు. దీంతో కలెక్టర్ ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే అక్కడే ఉన్న ఉపాధ్యాయులను మీ పిల్లలు ఎక్కడ చదువుతున్నారని ప్రశ్నించగా, కార్పొరేట్ స్కూల్‌లో చదువుతున్నారని సమాధానం ఇచ్చారు. ప్రభుత్వం నుంచి వేతనాలు పొందుతూ చదువు చెప్పకుండా నిరుపేద విద్యార్థులకు అన్యాయం చేస్తున్నారంటూ టీచర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ పాఠశాలలో ఏడుగురు ఉపాధ్యాయులు పనిచేస్తుండగా, నిర్లక్ష్యంగా విధులు నిర్వహిస్తున్న ఐదుగురు ఉపాధ్యాయులు రాజలక్ష్మి, సతీష్‌కుమార్, శ్వేత, భానుప్రకాష్ , విదాయిత్‌ల్లాఖాన్‌ను వెంటనే సస్పెండ్ చేయాలంటూ అక్కడే ఉన్న డీఈవోను ఆదేశించారు.