
ఐడీబీఐలో దిగిరానున్న కేంద్రం వాటా!
విక్రయానికి మార్గాల అన్వేషణ
రెండు వారాల్లో 32% పెరిగిన షేర్
న్యూఢిల్లీ: ఐడీబీఐ బ్యాంక్‌లో వాటా తగ్గించుకోవడం కోసం కేంద్ర ప్రభుత్వం వివిధ మార్గాలు అన్వేషిస్తోంది. ఆఫర్ ఫర్ సేల్(ఓఎఫ్‌ఎస్)తో సహా పలు మార్గాల ద్వారా వాటా విక్రయంపై ప్రభుత్వం కసరత్తు చేస్తోందని, అయితే ఈ ప్రయత్నాలన్నీ ప్రాథమిక దశలోనే ఉన్నాయని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. 2003లో పార్లమెంట్ ఆమోదించిన ఐడీబీఐ రద్దు చట్టం ద్వారా ఐడీబీఐ బ్యాంక్ ఏర్పాటైంది. అప్పటినుంచి ఈ సంస్థ బ్యాంక్‌గా, ఆర్థిక సేవల సంస్థగా కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఈ బ్యాంక్‌లో కేంద్రానికి ప్రస్తుతం 76.5 శాతం వాటా ఉంది.
యాక్సిస్ బ్యాంక్ తరహాలో ఐడీబీఐలో వాటాను తగ్గించుకోవాలనుకుంటున్నట్లు గత నెలలో(సెప్టెంబర్ 21 సోమవారం) ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ సూచనప్రాయంగా వెల్లడించారు. యాక్సిస్ బ్యాంక్‌లో కేంద్రానికి పరోక్షంగా 29.19 శాతం వాటా ఉంది. స్పెసిఫైడ్ అండర్‌టేకింగ్ ఆఫ్ ద యూనిట్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా(ఎస్‌యూయూటీఐ), ఎల్‌ఐసీ, మరో నాలుగు ఇతర ప్రభుత్వ రంగ సాధారణ బీమా సంస్థల ద్వారా కేంద్ర ప్రభుత్వానికి ఈ వాటా ఉంది. అయితే ప్రభుత్వ వాటా తగ్గింపు విషయమై కేంద్రం నుంచి తమకెలాంటి సమాచారం అందలేదని ఐడీబీఐ బ్యాంక్ స్టాక్ ఎక్స్చేంజీలకు నివేదించింది. బ్యాంక్ యూనియన్లు ప్రభుత్వ వాటా విక్రయ యోచనను వ్యతిరేకిస్తున్నాయి. మరోవైపు ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో కేంద్ర ప్రభుత్వ వాటాను 52 శాతానికి తగ్గించుకునే ప్రయత్నాలు చేస్తున్నామని ఈ వారం ప్రారంభంలో అరుణ్ జైట్లీ వెల్లడించారు.
షేరు దూకుడు...
కాగా ప్రభుత్వ వాటా విక్రయ వార్తలతో ఐడీబీఐ బ్యాంక్ షేరు పరుగులు పెడుతోంది. గత నెల 18న రూ.60 వద్ద ముగిసిన ఈ షేర్ 2 వారాల్లో 32 % వృద్ధితో గురువారం రూ.79.40 వద్ద ముగిసింది.